మార్కెటింగ్ నైపుణ్యాలను ఒడిసిపట్టి సేంద్రియ బాటలో సాగుతున్న రైతులకు ఈ సేద్యం సిరులు కురిపిస్తోంది. పెద్ద కమతాలు ఉన్నా.. కొంతమంది కలిసి ఉమ్మడిగా సాగినా చక్కటి ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో సాగవుతున్న పొలాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి, బెంగళూరుకు 30 కిలోమీటర్ల దూరంలోని రాగిహళ్లి గ్రామం... ఈ ప్రాంతాలకెళ్లి సేంద్రియ పంటలను చూస్తే కొత్త అనుభూతి కలుగుతుంది. అయితే రైతులకు లభిస్తున్న రేటుకు.. ఆ ఉత్పత్తి ప్రజలకు లభిస్తున్న ధరకూ ఎక్కడా పొంతన లేకుండా ఉంది.
ఉమ్మడి సేద్యానికి పరంపరాగత్ చేయూత
దేశంలో సేంద్రియ సాగును పెంచేందుకు ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’(పీకేవీవై) అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. గ్రామాల్లో ఒక ప్రాంతంలో ఈ పంటల సాగుపై ఆసక్తి ఉన్న వారందరినీ సంఘంగా ఏర్పాటుచేసి, వారి భూములను ‘క్లస్టర్’గా గుర్తించి ప్రోత్సహించాలనేది ఈ పథకం లక్ష్యం. కానీ రైతులకు ప్రోత్సాహకాలు అందించడంలో అన్ని రాష్ట్రాలు ఒకే తీరుగా లేవు.
ధ్రువీకరణ ఇలా...
సేంద్రియ పంట ధ్రువీకరణ (ఆర్గానిక్ సర్టిఫికెట్-ఓసీ) పొందడానికి ప్రత్యేక ఏర్పాటు ఉంది. ప్రతి రాష్ట్రంలో ఇందుకు సంబంధించిన కేంద్రం ఉంది. రైతులు దేశంలో ఎక్కడైనా ఓసీ పొందవచ్చు. హైదరాబాద్‌లో తెలంగాణ సేంద్రియ ధ్రువీకరణ మండలి ఉంది.
- ధ్రువీకరణ కావాల్సిన వారు విత్తనాలు, భూమి, పంటల వివరాలు నమోదు చేయాలి.
- ఏదైనా భూమి కనీసం మూడేళ్లుగా బీడుగా వదిలేసి ఉంటే ఇప్పుడందులో సేంద్రియ పంటను సాగుచేయవచ్చు. ఓసీ నేరుగా లభిస్తుంది.
- రసాయనాలతో పంటలు పండించే రైతులు ఈ పద్ధతిలోకి మారితే తొలిఏడాది ‘స్కోప్’(పరిధి) పేరుతో ధ్రువీకరణ లభిస్తుంది. వరసగా మూడోఏడాది వచ్చే దిగుబడికి ఓసీ జారీచేస్తారు.
- ‘పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం’(పీజీఎస్)లో రిజిస్టర్ చేసుకుని ఓసీ పొందితే మనదేశంలో ఈ ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చు.
- విదేశాలకు ఎగుమతి చేయాలనుకుంటే ‘జాతీయ సేంద్రియ ఉత్పత్తుల కార్యక్రమం’(ఎన్‌పీవోపీ)లో నమోదు చేసుకుని ఓసీ పొందాలి.
- తెలంగాణలో 173 మంది రైతులు 1,789 ఎకరాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 246 మంది 2,478 ఎకరాలను ఇప్పటికే ధ్రువీకరణ కోసం పేర్లు, పంటల వివరాలు నమోదు చేసుకున్నారు.
8.88 లక్షల టన్నుల ఎగుమతులు
మనదేశం నుంచి విదేశాలకూ భారీగా సేంద్రియ పంటలు ఎగుమతి అవుతున్నట్లు ‘భారత వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల అభివృద్ధి మండలి’ తాజాగా వెల్లడించింది.
- గతేడాది(2020-21)లో భారతదేశంలో 65.65 లక్షల ఎకరాల్లో ఈ పంటలు సాగవగా, 34.97 లక్షల టన్నుల దిగుబడులు వచ్చినట్లు తాజా నివేదికలో కేంద్రానికి తెలిపింది. వీటిలో 8.88 లక్షల టన్నులను ఎగుమతి చేయడం వల్ల రూ.7,078 కోట్ల ఆదాయం వచ్చింది.
- ఎగుమతి అయిన పంటల్లో సోయా, నూనెగింజలు, తృణ, చిరుధాన్యాలు, తేయాకు, కాఫీ, చక్కెర, డ్రైఫ్రూట్స్ తదితరాలున్నాయి.
ఈ ఫొటోలో కనిపిస్తున్న డ్రాగన్‌ఫ్రూట్ తోటను మెదక్ జిల్లా చేగుంట మండలం వల్లభాపూర్‌లో వి.సాయిరెడ్డి అనే రైతు సాగు చేశారు. మొత్తం 35 ఎకరాల్లో వేర్వేరు పంటలు వేశారు. పూర్తిగా జీవామృతం, సేంద్రియ ఎరువులతో సాగుచేస్తున్న ఈ క్షేత్రం బాగుందని ఎందరో శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యాన అధికారులు మెచ్చుకున్నారు.
‘దారి’ చూపుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి
తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సేంద్రియ పద్ధతుల్లో మామిడి సాగు సులభం, లాభదాయకం అని చెబుతున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తిలోనే 50 ఎకరాల్లో పలు రకాల మామిడి, బొప్పాయి, కూరగాయలు తదితర తోటల సాగుతో లాభాలార్జిస్తున్నారు. 90 శాతానికి పైగా సేంద్రియ ఎరువులే వాడుతున్నారు. ఇందుకోసం 120 దేశవాళీ గోవులను పెంచుతున్నారు. బంగినపల్లి, కేసరి, హిమాయత్, చిన్న, పెద్ద రసాల మామిడి పండ్లను నేరుగా ఐరోపా దేశాలకు ఎగుమతి చేశారు. ‘ఎకరానికి అన్ని రకాల ఖర్చులు కలిపి రూ.లక్ష అవుతుంటే ఆదాయం కనీసం రూ.3 లక్షల వరకూ వస్తోంది’ అని మంత్రి తెలిపారు.
7 వేల మంది రైతులతో సాగు
దేశంలో 22 స్వచ్ఛంద సంస్థలను ఒక గొడుగు కిందకు తెచ్చి ‘పీజీఎస్ సేంద్రియ మండలి’ ఏర్పాటుచేశాం. దేశవ్యాప్తంగా 7 వేల మంది రైతులను వేర్వేరు ప్రాంతాల్లో సంఘటిత పరిచాం. ఏపీలో 1,400 మంది రైతులు 5,222 ఎకరాల్లో, తెలంగాణలో 350 మంది 400 ఎకరాల్లో ఈ పంటలు పండిస్తున్నారు. కర్ణాటకలో రాగులు, సజ్జలు, మినుము, పెసలు, కందులు ఎక్కువగా పండిస్తున్నారు. తెలంగాణ, ఏపీలో కూరగాయలు, పండ్లను సాగుచేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలిచ్చి సహకరించాలి. ఒకరిద్దరు కాకుండా సంఘంగా ఏర్పడి అమ్ముకునేవారికే ఈ ఉత్పత్తులపై లాభాలు వస్తున్నాయి.