కల్లాల్లో కుప్పలు తెప్పలుగా వడ్లు.. నత్తనడకన సాగుతున్న కొనుగోళ్లు.. Farmers difficulties in grain buying centres: రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లోని కల్లాల్లో కర్షకుల కష్టాలు కొనసాగుతున్నాయి. పండించిన ధాన్యం సకాలంలో కొనుగోలు జరగక.. కేంద్రాల వద్ద అన్నదాత ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కప్పేందుకు పరదాలు కూడా లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిల్లుల సమస్య, నత్తనడకన సాగుతున్న కొనుగోళ్లతో.. అవస్థలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయలేదనే మనస్తాపంతో.. మెదక్ జిల్లా జానకంపల్లిలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించారు. చిట్యాల కొనుగోలు కేంద్రంలో.. తెచ్చిన ధాన్యాన్ని నెలరోజులు గడుస్తున్నా.. తూకం వేయడం లేదంటూ రైతు భిక్షపతి ఆందోళన చెందారు. రేపు.. మాపంటూ కాలయాపన చేశారని.. ఏం చేయాలో తెలియక మనస్తాపంతో పురుగుల మందు తాగినట్లు బాధితుడు తెలిపాడు.
"ధాన్యం కొనుగోలు కేంద్రంలో తెచ్చిన ధాన్యాన్ని నెలరోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదు. రేపు, ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక మనస్తాపంతో పురుగుల మందు తాగాను." - భిక్షపతి, బాధిత రైతు
వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం.. రైతులకు తలనొప్పిగా మారింది. వడ్లపై కప్పేందుకు పరదాలు, లారీలు అందుబాటులో లేకపోవడం, మిల్లుల సమస్యతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నత్తనడకన సాగుతున్న కొనుగోళ్లతో.. కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. జిల్లాలో 196 కొనుగోలు కేంద్రాల ద్వారా 2లక్షల 35వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా.. ఇప్పటివరకు 10వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నామని అధికారులు చెబుతున్నారు. నెల రోజులు గడుస్తున్నా ధాన్యం సకాలంలో కాంటాలు కాని పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాలు ఉన్నా... వాటికి అనుగుణంగా మిల్లులు లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో మిల్లుల కొరత.. రైతులను తీవ్రంగా వేధిస్తుంది.
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం నీటి పాలైన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. ఖానాపురం మండలానికి చెందిన ఐదుగురు రైతులు పండించిన పంటను.. జాతీయ రహదారిపై ఆరబోశారు. తెల్లవారుజామున మిషన్ భగీరథ పైపు పగిలి ఒక్కసారిగా నీరు ఎగిసిపడింది. దీంతో రహదారిపై ఉన్న వడ్లు పూర్తిగా నీళ్ల ప్రవాహానికి కొట్టుకుపోయాయి. సుమారు 10 లక్షల విలువైన 12 ఎకరాల ధాన్యం తడిసిపోయింది. దీనిపై ప్రభుత్వం న్యాయం చేయాలంటూ రైతులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు.
ఇవీ చదవండి: