Farmers Protest in Telangana : కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా.. తూకం వేయడం లేదంటూ మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో రైతులు ధర్నా చేశారు. అన్నదాతల ఆందోళనకు కాంగ్రెస్, బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. పనులను వదిలిపెట్టి కొనుగోలు కేంద్రాల వద్ద అవస్థలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధర్నాతో నర్సాపూర్ చౌరస్తాలో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. అధికారులు, పోలీసులు నచ్చజెప్పినా దిగిరాకపోవటంతో.. అధికారులు సమస్య పరిష్కరిస్తామని హామీతో ఆందోళన విరమించారు.
మెదక్ జిల్లా తూప్రాన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద కొందరు గ్రామస్థులు నిరసన చేపట్టారు. చిన్న శంకరంపేటలో హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధాన్యం పోసిన రైతులు.. నిప్పంటించి తగులబెట్టారు. అకాల వర్షాలతో కష్టమంతా నీటి పాలైందని.. మిగిలిన కొద్ది ధాన్యాన్నీ కొనుగోలు చేసేందుకు కొర్రీలు పెట్టడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోళ్లలో కోతకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి..: తరుగు పేరుతో ధాన్యం కోతను నిరసిస్తూ జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో రహదారిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. కొనుగోళ్లలో జాప్యం వల్ల కర్షకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కోతకు పాల్పడుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సకాలంలో కొనుగోళ్లు పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.