farmer: రుణ బకాయిల వసూలుకు డీసీసీబీ అధికారులు వ్యవహరించిన తీరుతో రైతు మనస్తాపం చెంది ఊరొదిలి వెళ్లారు. భూమిని వేలం వేస్తామంటూ స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు నోటీసు అంటించడంతో పాటు.. బ్యానర్ కట్టారు. అధికారుల చర్యల వల్ల గ్రామంలో అప్పు పుట్టే పరిస్థితి లేదని ఆందోళన చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోలు మండలం కన్‌సానిపల్లి గ్రామంలో జరిగింది.
రుణం చెల్లించలేదని బ్యానర్.. మనస్తాపంతో ఊరొదిలి వెళ్లిన రైతు - farmer left his village
farmer: రుణ బకాయిల వసూలుకు డీసీసీబీ అధికారులు వ్యవహరించిన తీరుతో ఓ రైతు మనస్తాపం చెంది ఊరొదిలి వెళ్లారు. భూమిని వేలం వేస్తామంటూ స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు నోటీసు అంటించడంతో పాటు.. బ్యానర్ కట్టారు. దాన్ని అవమానంగా భావించిన అతను కుటుంబంతో సహా గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కన్‌సానిపల్లికి చెందిన శంకర్‌రెడ్డికి స్థానికంగా 3.31 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించి 2012-13లో జోగిపేట పట్టణంలోని డీసీసీబీ శాఖలో రూ.60వేల పంట రుణం తీసుకున్నారు. పంటలు సరిగా పండకపోవడంతో రుణాన్ని తిరిగి చెల్లించలేదు. ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. దానిపై ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్ల క్రితం బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో రూ.40వేలు చెల్లించారు. మిగతావి రద్దవుతాయని భావించారు.
ఈ ఏడాది డీసీసీబీ అధికారులు వడ్డీతో కలిపి రుణం మొత్తం రూ.79,641 చెల్లించాలని పలుసార్లు తాఖీదులు పంపారు. ఈ నెల 23న వ్యవసాయ భూమిని వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. పంచాయతీ కార్యాలయం వద్ద వేలానికి సంబంధించిన నోటీసు అంటించడంతోపాటు.. ఇందుకు సంబంధించిన బ్యానర్ కట్టారు. దాన్ని అవమానంగా భావించిన శంకర్‌రెడ్డి రెండు రోజుల క్రితం తన కుటుంబంతో కలిసి గ్రామం విడిచి ఇస్నాపూర్‌కు వెళ్లారు. డీసీసీబీ అధికారుల వల్ల గ్రామంలో అప్పు పుట్టే పరిస్థితి లేదని శంకర్‌రెడ్డి తెలిపారు. అందుకే బతుకు దెరువుకు ఫ్యాక్టరీలో పనిచేసేందుకు ఇస్నాపూర్‌కు వచ్చానని ఆయన చెప్పారు.