మంచి చేద్దామని ఆలోచించడమే... ఆ రైతు(Farmer land issue) చేసిన తప్పు. పొరపాటున తన పేరు మీదకు మారిన ఇతరుల భూమిని తిరిగి అసలైన పట్టాదారుకే దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేయడమే ఆయన చేసిన పాపం. తప్పులు సరిదిద్దాల్సిన అధికారులు... ఈసారి ఏకంగా ఆ రైతు భూమిని కూడా వేరే వారి పేర్ల మీదకు మార్చారు. ఇదేంటని ప్రశ్నించినా.... స్పందించడంలేదు. కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవడంలేదు. కొందరు ప్రభుత్వ అధికారుల తీరు... సామాన్యులకు ఎంతటి కష్టాలను తెచ్చిపెడుతుందో ఇదో సజీవ ఉదాహరణ.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన మాడెప్పకు(Farmer land issue) నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. ఆ భూమినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో యాదుల్లా అనే వ్యక్తికి చెందిన ఎకరం భూమిని.. మాడెప్ప పేరు మీదకు మర్చారు. కొత్త పాసు పుస్తకమూ ఇచ్చారు. తనకు పాసు పాసుపుస్తకం రాకపోవడంతో హైదరాబాద్‌లో వుండే యాదుల్లా తహసీల్దార్‌ని కలిసి ఇదే విషయం అడిగారు. జరిగిన తప్పిదాన్ని గుర్తించిన అధికారులు... మాడెప్ప వచ్చి తనకు అభ్యంతరం లేదని చెబితే భూమిని మార్పు చేస్తామని యాదుల్లాకి చెప్పారు. యాదుల్లా... మాడెప్ప వద్దకు వచ్చాడు. విషయం చెప్పడంతో వెంటనే మాడెప్ప తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆ భూమి తనది కాదని... యాదుల్లా పేరు మీదకు మార్చాలని రాసి ఇచ్చాడు. అదే ఆయన చేసిన పెద్ద తప్పయింది. ఎకరాకు బదులుగా మాడెప్ప భూమి నాలుగున్నర ఎకరాలు కూడా యాదుల్లాతోపాటు మరో ఇద్దరి పేరు మీదకు మార్చారు.
రైతుబంధు(Rythu Bandhu) రాకపోవడంతో ఆరా తీసిన మాడెప్పకు అసలు సంగతి తెలిసింది. భూమిని తిరిగి తన పేరు మీదకు మార్చాలని రెండేళ్లుగా తిరుగుతున్నా... అధికారులు పట్టించుకోవడంలేదు. కాళ్లా, వేళ్లా పడ్డా తమ వల్ల కాదంటూ చేతులు ఎత్తేశారు. ఆ ముగ్గురి నుంచి కొన్నట్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకోమని ఉచిత సలహా మాత్రం ఇస్తున్నారని మాడెప్ప వాపోతున్నాడు. ఇన్నేళ్లుగా రైతుబంధు డబ్బులు నష్టపోయిన మాడెప్ప....రిజిస్ట్రేషన్‌కు మరింత డబ్బు కోల్పోవాల్సిన పరిస్థితి.