ప్ర:మరోసారి కరోనా ఉద్ధృతి కనిపిస్తోంది. రోజురోజూకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజల్లో అప్రమత్తత ఎలా ఉంది?
జ: రెండో దశ కరోనా ఉద్ధృతి ప్రారంభమైంది. గతంలో రోజుకు 10కేసులు వస్తే ప్రస్తుతం 50కి పైగా నమోదు అవుతున్నాయి. మా సిబ్బందిలోనూ పలువురు వైరస్ బారిన పడుతున్నారు. జాగ్రత్త చర్యలు పాటించడంలో ప్రజలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది కనీసం మాస్కు కూడా పెట్టుకోకుండానే బహిరంగ ప్రదేశాల్లోకి వస్తున్నారు. ఇటువంటి వారికి అవగాహన కల్పిస్తున్నాం. సోమవారం నుంచి మాస్కు లేకుండా బయటికి వచ్చే వారికి జరిమానాలు విధిస్తాం.
ప్ర:ప్రతి ఒక్కరూ మాస్కు పెట్టుకునేలా ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జ:మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాలకు వచ్చారంటే వారు కరోనా వాహకులుగానే పరిగణించాలి. సోమవారం నుంచి ఎవరైనా మాస్కు లేకుండా బయటికి వస్తే జరిమానా విధిస్తాం. మాస్కు లేకుంటే దుకాణాల్లో, కార్యాలయాల్లోకి అనుమతించకుండా నిర్వాహకులుకు అవగాహన కల్పిస్తున్నాం. పరిశ్రమల్లో పని చేసే ప్రతి ఒక్కరు కూడా మాస్కు ధరించేలా ఆదేశాలు ఇచ్చాం.
ప్ర:ప్రస్తుతం చేస్తున్న తనిఖీలు కొనసాగిస్తారా? గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి?
జ:గ్రామీణ ప్రాంతాల్లో అక్కడి పోలీసు స్టేషన్ల పరిధిలోని సిబ్బంది అవగాహన కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామపంచాయతీలతో కలిసి వీటిని విస్తృతం చేస్తాం. దాదాపుగా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా కూడా అవగాహన కల్పిస్తాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా తనిఖీలు కొనసాగిస్తాం.