సంగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ మొట్టమొదటి కాంగ్రెసేతర ఎమ్మెల్యే చెంగల్ బాగన్న ఇకలేరు. ఎడ్లబండిని నడిపిన బాగన్న ఆ ప్రాంత ప్రజలకు ఆయన సుపరిచితులు. జీవనాధారం కోసం అప్పట్లో ఆయన ఎండ్లబండి నడపేవారు. పట్టణంలోని మిల్లులకు ధాన్యం తీసుకెళ్లాలన్నా.. పెద్దమొత్తంలో సరకులు ఇంటికి తేవాలన్నా అప్పట్లో బాగన్న బండివైపే అందరూ చూసేవారు. కలుపుగోలుతనం, మర్యాదగా పలకరించడం, డబ్బులు తక్కువైనా సర్దుకుపోవడమే అందుకు కారణం. కాలక్రమంలో ఆ మంచితనమే ఆయనను శాసనసభలో అడుగుపెట్టేలా చేసింది.
రాజకీయ ప్రయాణం
వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన బాగన్న సర్పంచిగా, శాసన సభ సభ్యుడిగా ఎదిగారు. కాంగ్రెస్ కంచుకోట అయిన గోపన్‌పల్లిలో 1981లో సర్పంచిగా ఎన్నికయ్యారు. 1987లో ఎంపీపీగా గెలిచారు. తన సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే మనస్తత్వం కావడంతో అనతికాలంలోనే ఆయన అందరి అభిమాన నేతగా ఎదిగారు. 1994లో జరిగిన ఎన్నికలకు ఆరునెలల ముందే జహీరాబాద్ నుంచి తెదేపా తరఫున బాగన్న పోటీచేస్తారని ఎన్టీఆర్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై బాగన్న 34,970 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం.
కులమతాలకు అతీతంగా...
బాగన్న శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో జహీరాబాద్ ప్రాంత వాసులు చాలా మందిని ఆయన ప్రత్యేకంగా తీసుకెళ్లి శాసనసభను చూపించారు. జహీరాబాద్ నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే తన నివాసంలోనే వారికి బస ఏర్పాటు చేసేవారు. కింది స్థాయి కార్యకర్తలను.. కులమతాలకు అతీతంగా రాజకీయంగా ప్రోత్సహించే వారు.