మామిడి తోటల్లో దేశంలోనే అత్యంత ఖరీదైన హిమాయత్ రకం మొక్కలను ఉత్పత్తి చేసి అందిస్తే కేవలం రెండేళ్లలో రైతులకు లాభాలు చేతికి వస్తాయని రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారులు స్పష్టం చేశారు. ములుగులో ఉన్న ఫలపరిశోధన కేంద్రంలో మామిడి మొక్కల పెంపకంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం నమూనాగా సాగు చేసిన హిమాయత్ రకం మామిడి చెట్లకు వచ్చిన దిగుబడులు ఆసరాగా తీసుకొని ముందుకు వెళుతున్నారు.
ములుగులో ఉన్న ఫలపరిశోధన కేంద్రంలో 2017 ఆగస్టులో సంగారెడ్డిలోని ఫలపరిశోధన కేంద్రం నుంచి హిమాయత్ రకం మామిడి కొమ్మలను తీసుకువచ్చి ములుగులో అంటుకట్టుడు విధానంలో నాటారు. నాటిన ఆరు మాసాల నుంచి మొక్కలకు వచ్చే కొమ్మలను కత్తిరించి సస్యరక్షణ చర్యలు చేపట్టారు. నాటిన రెండేళ్ల తర్వాత ఈ చెట్లకు విపరీతమైన కాయలు వచ్చాయి.
హిమాయత్ రకం మామిడి - సస్యరక్షణ
- అంటుకట్టుడు ద్వారా తొందరగా దిగుబడి రావడం ప్రారంభమైంది. ఈ రకం చెట్ల ఎత్తు తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఈదురు గాలులు వచ్చినప్పుడు కాయలు రాలిపోవడం, చెట్లు విరగడం లాంటి సమస్య ఉండదు.
- ఎకరం విస్తీర్ణంలో 666 మొక్కలు నాటాల్సి ఉంటుంది. రెండేళ్లకు నిర్వహణ ఖర్చు రూ.లక్ష లోపే ఉంటుందని అధికారులు తెలిపారు.
- అంటుకట్టుడు కాకుండా సాధారణ మొక్కలు వేస్తే ఏడేళ్లకు కాయలు వస్తాయి. రైతులందరూ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వాటినే సాగు చేయాలని అప్పుడే ఆర్థికంగా లాభాలు ఆర్జిస్తారని ఉద్యానశాఖ సూచిస్తోంది.