నిచ్చెనలు, పాములతో ఎంతో ఆసక్తికరంగా సాగే వైకుంఠపాళీ ఆటలో ఎంతో పరమార్థం దాగి ఉంటుంది. ఈ సందేశాత్మకమైన ఆటను ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వినియోగించుకుంటున్నారు ఎన్నికల అధికారులు. నిచ్చెనలు వచ్చినప్పుడు పైకి ఎక్కుతూ... పాములు వచ్చినప్పుడు కిందికి జారుతూ... ప్రతి అడుగులో ఓ సందేశాన్నిచ్చే ఈ ఆట ఆధారంగా... సంగారెడ్డి పురపాలక సంఘం అధికారులు సరికొత్త వైకుంఠపాళీని రూపొందించారు. నిచ్చెనలొచ్చినప్పుడు... పోలింగ్ కేంద్రంలో చేయాల్సిన అంశాలు, పాములు వచ్చినప్పుడు చేయకూడని పనులు వివరిస్తూ... ఎన్నికల వేళ ఓటు హక్కు ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తున్నారు.
ఆసక్తి పెంచుతున్న ఆట...
కళాశాలలు, జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వైకుంఠపాళీని ప్రదర్శించి... ఆడిస్తున్నారు. ప్రస్తుతం అంతగా అందుబాటులోలేని ఈ ఆట ఆడటానికి ఓటర్లు ఆసక్తిగా ముందుకు వస్తున్నారు. తమకు పడిన నెంబర్ ఆధారంగా గళ్లు మారుతూ... అక్కడ ఉన్న అంశాన్ని గ్రహిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో చేయకూడని అంశం ఉన్న గడిలోకి వస్తే... పాము మింగి కిందికి దిగిపోతున్నారు. చేయాల్సిన అంశం ఉన్న గడి వస్తే... అందులోని నిచ్చెన ఆధారంగా పైకి వెళ్తున్నారు. ఆడుతున్న వ్యక్తి ఎందుకు కిందకు వెళ్తున్నాడు... పైకి వెళ్తున్నాడు అన్న అంశాలను అధికారులు సవివరంగా వివరిస్తున్నారు.