తెలంగాణ

telangana

ETV Bharat / state

విత్తనాలు నాటుకునే శుభలేఖలు.. పర్యావరణ హితంగా కల్యాణం.. - అరుణ

వివాహం అంటే వైభవంగా చేయాలని.. తమ బంధుమిత్రులందరూ కలకాలం గుర్తుంచుకునేలా  ఉండాలని అందరూ భావిస్తుంటారు. శుభలేఖల నుంచి భోజనాల వరకు ఖర్చు గురించి ఆలోచించకుండా.. తమ స్థాయికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తారు. కానీ సంగారెడ్డికి చెందిన ఓ కుటుంబం మాత్రం పెళ్లి తంతు మొత్తం పర్యావరణ హితంగా చేసేలా ఆలోచిస్తోంది. కేవలం పెళ్లే కాదు.. తమ జీవన విధానమే పర్యావరణానికి అనుకూలంగా మార్చుకున్నారు.

విత్తనాలు నాటుకునే శుభలేఖలు.. పర్యావరణ హితంగా కళ్యాణం..

By

Published : Nov 9, 2019, 6:07 PM IST

Updated : Nov 9, 2019, 8:26 PM IST

విత్తనాలు నాటుకునే శుభలేఖలు.. పర్యావరణ హితంగా కల్యాణం..
సంగారెడ్డికి చెందిన విజయ్ భాస్కర్ రెడ్డి, అరుణల ఇంటికి వెళ్లగానే ప్రధాన గుమ్మానికి పక్షుల ఆహారం కోసం ఏర్పాటు చేసిన వరి కంకుల తోరణం ఆహ్వానం పలుకుతుంది. ప్రతీ ప్రాణి ప్రకృతిలో భాగమే అని భావించే ఈ కుటుంబం.. పర్యావరణానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. విజయ భాస్కర్ రెడ్డి, అరుణ దంపతులు తమ కుమార్తె పెళ్లికి ఇచ్చే ఆహ్వాన పత్రిక తయారీని పర్యావరణాన్ని కాపాడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేతితో తయారు చేయించిన కాగితాన్ని, ప్రకృతి సిద్ధమైన సిరాను వినియోగించారు. ఈ శుభలేఖకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇందులో తులసి గింజలు పొదిగి ఉంటాయి. శుభలేఖను ఒక రాత్రి నీటిలో నానబెట్టి.. ఉదయం దాన్ని ముక్కలుగా చేసి భూమిలో వేస్తే.. అందులోని గింజలు మొలకెత్తి.. తులసి మొక్కలు వస్తాయి. ఈ ప్రక్రియను కూడా శుభలేఖపై ముద్రించారు. పెళ్లిలో ఉపయోగించే వివిధ వస్తువులు పర్యావరణ హితమైనవే అయేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎకో ఫ్రెండ్లీగా ఇంటి నిర్మాణం...

నీటిపారుదల శాఖలో ఈఈగా విధులు నిర్వర్తిస్తున్న విజయ భాస్కర్ రెడ్డి అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకృతితో మమేకమైతుంటారు. ఆయన దేశంలోని దాదాపు అన్ని ప్రధాన అడవుల్లో పర్యటించారు. నెలల తరబడి హిమలయాల్లో గడుపుతారు. తమ ఇంటిని ఎకో ఫ్రెండ్లీగా నిర్మించుకున్నారు. ఇంట్లో ఏ గదిలో కూడా పగలు వెలుతురు కోసం లైటు వేసుకోవాల్సిన అవసరం లేకుండా.. ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా నిర్మించుకున్నారు. ప్రతి వర్షపు చుక్కను సంరక్షించేలా ఇంకుడు గుంతను తవ్వుకున్నారు. సౌరవిద్యుత్ పరకరాలు ఏర్పాటు చేసుకుని.. దాని నుంచి వచ్చే విద్యుతునే వినియోగిస్తున్నారు.

బంతి విత్తనాలతో గ్రీటింగ్​ కార్డ్స్​:

ఆపద నుంచి పెటా సంస్థ సంరక్షించిన ఓ ఊర కుక్కను.. దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఈ కుటుంబం పండుగలు, వేడుకలను కూడా పర్యావరణం కోసం వాడుకుంటోంది. ఇటీవల దీపావళికి బంతి విత్తనాలు ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్డులను భూమిలో వేసి.. నీరు పోస్తే.. అందులోంచి బంతి మొక్కలు రావడం విశేషం. జీవహింస చేయోద్దనే లక్ష్యంతో ఈ కుటుంబం శాఖహారాన్నే తీసుకుంటుంది. విదేశాల్లో ఉన్నా వీరు శాకాహారమే తినడం విశేషం. పర్యావరణ సంరక్షణను మాటల్లో కాకుండా తమ జీవన విధానంలో చూపిస్తున్న ఈ కుటుంబం అందరికి ఆదర్శం.
ఇవీ చూడండి: టిక్​టాక్​తో ప్రేమ... రాష్ట్రం దాటిన యువతులు

Last Updated : Nov 9, 2019, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details