సంగారెడ్డి జిల్లా అలియాబాద్‌లో ఔత్సాహిక రైతు శ్రీనివాస్... నాలుగేళ్లుగా డ్రాగన్ ప్రూట్ సాగు చేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ పండును... ఎలాగైనా మన దేశంలో పండించాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ పరిశోధన కేంద్రాలు, విశ్వవిద్యాలయాల నుంచి సమాచారం సేకరించారు. దాదాపు 13 దేశాల్లో పర్యటించి పూర్తి అవగాహన పొందిన తర్వాత.... డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసి విజయం సాధించారు. 'ఫీల్డ్ డే' పేరుతో శాస్త్రవేత్తలను, రైతులను తన పొలానికి ఆహ్వానించి అవగాహన కల్పించారు.
ధర ఎక్కువే
ఈ ప్రాంతానికి అనువైన, బరువు ఉండే రకాలు ఎంచుకొని పండించారు. సాధారణ పంటకు అదనంగా అన్ సీజన్‌లోనూ దిగుబడి సాధించారు. ఆ సమయంలో ధర ఎక్కువగా ఉండటంతో లాభాలు గడించినట్లు శ్రీనివాస్ తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్‌కు సంబంధించిన మార్కెటింగ్, ఇతర విషయాలను పరిశోధన సంస్థల ద్వారా తెలుసుకున్నట్లు వెల్లడించారు.
ఫీల్డ్ డే
'ఫీల్డ్ డే' కార్యక్రమానికి వివిధ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు హాజరయ్యారు. డ్రాగన్ ఫ్రూట్ తోటలోని మొక్కలను పరిశీలించారు. 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాలు ఈ తోటలకు అనుకూలమని వారు చెప్పారు. కానీ, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయని... పూర్తి అవగాహనతో సాగు చేయాలని సూచించారు.