సంగారెడ్డి జిల్లాలో ఈ సంవత్సరం రబీలో సాగైన 2800 టన్నుల మేర కందులు కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్ అధికారులు నిర్ణయించారు. కేంద్రం అనుమతి మేరకు జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జహీరాబాద్‌లో జనవరి 27న కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మాణిక్‌రావు ప్రారంభించారు. ఈనెల 3 వరకు 3207 క్వింటాళ్లు కొనుగోలు చేశారు.
రైతుల ఆందోళన
రాయికోడ్ కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు 2100 క్వింటాలు కొనుగోలు చేశారు. నారాయణఖేడ్‌లో మాత్రం ఆన్‌లైన్ వివరాలు... రైతులు తెచ్చే పంటకు పొంతన లేకపోవడం వల్ల కొనుగోలు ఇంకా ప్రారంభం కాలేదు. జహీరాబాద్ కొనుగోలు కేంద్రానికి కందులు తీసుకొస్తున్న రైతులకు మాత్రం ఆన్‌లైన్‌లో వివరాలు లేవని 10, 12 రోజులుగా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తిప్పుకుటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు నమోదు కాకపోవడం వల్లే
పొలంలో పండిన కంది నమూనాలు తీసుకుని కొనుగోలు కేంద్రాలకు వస్తున్న రైతులకు నిత్యం పడిగాపులు తప్పడం లేదు. టోకెన్ల జారీలోనూ... కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పంటసాగు సమయంలో రైతుల నుంచి వివరాలు సేకరించి వ్యవసాయ శాఖ సిబ్బంది అంతర్జాలంలో సరైన వివరాలు నమోదు చేయకపోవడం వల్లే.. ఈ సమస్యలు తలెత్తున్నాయని రైతులు వాపోతున్నారు.