సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో గత 35 ఏళ్లుగా డీడీఎస్ సేంద్రీయ విధానంలో పాత పంటల సాగును ప్రోత్సహిస్తోంది. చిరుధాన్యాలు సాగు చేసే రైతులకు అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా అన్నదాతలకు పంటల సాగుకు పెట్టుబడి సమకూర్చడంతో పాటు.. వారు పండించే పంట కొనుగోలుకు భరోసా ఇచ్చేలా 2018లో బీయాండ్ ఆర్గానిక్ అన్న కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న వినియోగదారులను రైతుల వద్దకే తీసుకువస్తోంది. వారు పంటల సాగుకు ముందే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దానికి ప్రతిగా తమ పొలంలో పండిన పంటలను రైతులు వారికి అందిస్తున్నారు.
రైతులకు పెట్టుబడి సాయం
జహీరాబాద్లోని అర్జున్ నాయక్ తండాను ఎంపిక చేసిన డీడీఎస్.. సేంద్రీయ విధానంలో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు... ఎకరాకు పది వేల రూపాయల సాయాన్ని వినియోగదారుల ద్వారా ఏటా అందిస్తోంది. ఇలా ముందుగా అందిన సాయంతో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు, కూలీలు వంటి ఖర్చులను తీర్చుకుంటున్నారు. గతంలో తాము పెట్టుబడి కోసం వడ్డీకి అప్పు తెచ్చేవాళ్లమని.. ఇప్పుడు తమకు ఆ బాధలు తప్పాయని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.