Cybercrimes in Sangareddy District : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త తరహాలో కేటుగాళ్లు... బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఆఫర్ల పేరుతో లింక్‌లు పంపడం, బహుమతి గెలిచారని మాయమాటలు చెప్పడం లాంటివి ఇప్పుడు సాధారణమయ్యాయి. మరోవైపు సంక్షిప్త సందేశాలు పంపి నగదు కాజేస్తున్నారు. తాజాగా ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగుల నుంచి అందినకాడికి డబ్బు దోచుకున్నారు. చివరికి మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Cyber Frauds in Ameenpur : తాజాగా అమీన్‌పూర్‌కి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగినికి.. మే 15న పార్ట్ టైం జాబ్ అంటూ.. వాట్సాప్‌కు ఓ మెసేజ్వచ్చింది. ఆ సంక్షిప్త సందేశానికి స్పందించిన ఆమె.. అందులో సూచించిన సైట్‌లో తన వివరాలను నమోదు చేసింది. ఈ క్రమంలోనే సదరు ఉద్యోగినికి ఒక వ్యాలెట్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారు. ఇందులో భాగంగానే ముందుగా బాధితురాలు రూ.2,000 చెల్లించింది. అనంతరం సైట్ నిర్వాహకులు ఇచ్చిన టాస్క్‌లు చేయడం మొదలుపెట్టింది.
ఈ క్రమంలోనే బాధితురాలు పెట్టిన నగదుకు.. అందుకు వచ్చిన కమిషన్‌ను సైబర్ నేరగాళ్లు ఆమెకు ఇచ్చిన వ్యాలెట్‌లో చూపిస్తూ వచ్చారు. ఇలా బాధితురాలి నుంచి పలు దఫాలుగా మొత్తం రూ.46 లక్షలు పెట్టించారు. ఈ నేపథ్యంలోనే సదరు ఉద్యోగిని తన డబ్బులు, కమిషన్ ఇవ్వాలని వారిని అడిగింది. దీనికి వారు స్పందించలేదు. చివరికి మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది.