vaccination in villages: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మొదలవడంతో వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో టీకాలు వేసుకునేందుకు ప్రజలు వెనకడుగేస్తున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామస్థులు వ్యాక్సిన్ నిరాకరించడంతో అధికారులు కఠిన చర్యలకు దిగారు.
అవగాహన కల్పించినా ముందుకు రావడం లేదు
vaccine reject in sekhapur: జిల్లా అధికారులు శేఖాపూర్ గ్రామానికి చేరుకుని అవగాహన కల్పించిన ఆశించిన స్థాయిలో టీకా పంపిణీ జరగకపోవడంతో అధికారులు కఠిన నిర్ణయాలకు ఉపక్రమిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోకపోతే రేషన్ సరుకుల నిలిపివేత, ఇంటికి విద్యుత్ కనెక్షన్ తొలగింపు చర్యలు చేపడుతున్నారు. సోమవారం గ్రామానికి విచ్చేసిన జిల్లా అదనపు పాలనాధికారి రాజర్షి షా వ్యాక్సిన్ వేసుకోవాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. దీనిపై పలువురు అభ్యంతరం చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.
బెదిరించగానే ముందుకొచ్చారు
వ్యాక్సిన్ వేసుకోవాలని ఏమైనా ఆదేశాలు ఉన్నాయా.. మా ఆరోగ్యం దెబ్బతింటే మాకు ఎవరు దిక్కు? అంటూ ఎదురు ప్రశ్నలు సంధించారని అధికారులు చెబుతున్నారు. గ్రామస్థుల సమాధానంపై మండిపడిన అదనపు పాలనాధికారి అప్పటికప్పుడు పలువురు ఇంటికి విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని ఆదేశించారు. దీంతో దిగొచ్చిన గ్రామస్థులు టీకా వేసుకునేందుకు అంగీకారం తెలపడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. వారం లోపు టీకా పంపిణీ పూర్తి చేయాలనే లక్ష్యంతో వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ టీకాలు వేస్తున్నారు.