సంగారెడ్డి శివారులోని ఐఐటీ హైద్రాబాద్ ఎనిమిదో స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. దేశ నిర్మాణలో విద్యార్థుల పాత్ర కీలకమైనదని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సి ఉండగా... అత్యవసర సమావేశాల వల్ల హాజరు కాలేదు. స్కైప్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 522మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు, వెండి పతకాలు బహుకరించారు.
అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
జపాన్, చైనా అంతర్జాతీయ మార్కెట్లలో సత్తా చాటుతున్నాయని... మనం కూడా అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారించాలని అమితాబ్ కాంత్ సూచించారు. దేశం అభివృద్ధి చెందాలంటే లింగ వివక్ష పోవాలన్నారు. దేశంలోనే హైదరాబాద్ ఐఐటీ మొదటి పది అత్యుత్తమ సాంకేతిక సంస్థల్లో ఒకటిగా నిలిచినట్లు పాలక మండలి అధ్యక్షులు బీవీఆర్ మోహన్ రెడ్డి వెల్లడించారు. పెద్దపెద్ద లక్ష్యాలు నిర్దేశించుకొని వాటి సాధనకు కోసం విద్యార్థులు కృషి చేయాలని ఆయన అన్నారు.
ఐఐటీ నుంచి డిగ్రీ పొందడం గర్వంగా ఉందని విద్యార్థులు అన్నారు. ఐఐటీ తమకు అనేక అవకాశాలు కల్పించిందని వారు తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యపకులు, పరిశోధనకు, అధ్యయానికి ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. ఇక్కడ చదువడం వల్ల దేశానికి ఉపయోగపడేలా తమను తాము తీర్చిదిద్దుకున్నామని విద్యార్థులు తెలిపారు. తమ పిల్లలు పట్టా తీసుకునే దృశ్యాన్ని చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ప్రాంగణంలో సందడి నెలకొంది.
ఐఐటీ స్నాతకోత్సవంలో అమితాబ్ కాంత్ స్కైప్ ప్రసంగం ఇదీ చూడండి: సోనియా ఎన్నిక పట్ల టీ-కాంగ్రెస్ శ్రేణుల హర్షం