ముఖ్యమంత్రి కేసీఆర్ నారాయణఖేడ్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సభలో మంత్రి హరీశ్‌రావు ప్రసంగిస్తూ.. నారాయణఖేడ్ ఉపఎన్నికల సందర్భంగా 2017లో తనను కలిసి గోడు వెళ్లబోసుకున్న చిమ్నీబాయి అనే మహిళ గురించి గుర్తుచేసుకున్నారు. కంగ్టి మండలం సర్దార్ తండాకు చెందిన చిమ్నీబాయి.. తమ తండాలో నీళ్లు లేవని, కరెంటు ఉండదని, రోడ్డు లేదంటూ తనకు చెప్పగా తాము అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. రానున్న రోజుల్లో నారాయణఖేడ్‌కు సాగునీళ్లు రానున్నాయని పేర్కొన్నారు.
వేదిక మీదికి ఆహ్వానించి..
అదే సమయంలో.. చిమ్నీబాయి ఇక్కడే ఉండొచ్చని ఎదో మాటవరుసకు హరీశ్‌రావు అనగానే.. ప్రజల్లో ఉన్న ఆమె నిజంగానే లేచి నిలబడింది. అంతమందిలో ఆమెను హరీశ్‌రావు గుర్తుపట్టగా.. వేదిక మీదికి రావాలంటూ కేసీఆర్ ఆహ్వానించారు. తన పక్కనే కూర్చోబెట్టుకున్న సీఎం.. ఆమెతో కాసేపు మాట్లాడారు. సర్ధార్ తాండలో జరిగిన అభివృద్ధి గురించి ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగిన కేసీఆర్.. వాటి పరిష్కరానికి సైతం హమీ ఇచ్చారు. నారాయణఖేడ్ అభివృద్ధి కోసం హరీశ్‌రావు ఎంతగా కృషి చేశారో చెప్పడానికి చిమ్నీబాయిని ఇన్ని రోజులు గుర్తుంచుకోవడమే నిదర్శమని తెలిపారు.