Trainee Civils Officers Visit in Sangareddy : పేద, మధ్యతరగతి కుటుంబాలైనా.. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే లక్ష్యసిద్ధితో విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని విద్యారంగంలో రాణించారు. అఖిల భారత సర్వీసులో సేవలందించాలనే సంకల్పంతో నిర్వహించిన పోటీ పరీక్షల్లో నెగ్గి కేంద్ర సర్వీసులలో స్థానం సంపాదించారు. మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్న 30 మంది.. ఉద్యోగ శిక్షణలో భాగంగా ఆరు బృందాలుగా క్షేత్ర పర్యటన నిమిత్తం సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. జహీరాబాద్ మండలం కొత్తూర్-బి, కొండాపూర్ మండలం హరిదాస్‌పూర్, కంది మండలం చెర్లగూడెం, ఎద్దుమైలారం, పుల్కల్ మండలం గొంగ్లూర్, హత్నూర మండలం చీక్ మద్దూర్ గ్రామాల్లో పర్యటించి ప్రజల జీవన శైలి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
అందుకే ఈ పర్యటన..
Civils officers Team Visit in Sangareddy : సివిల్స్ ఉద్యోగం అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నది. ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలు, కార్యక్రమాల రూపకల్పనలో వీరిదే కీలక పాత్ర. ప్రజా ధనం పక్కదారి పట్టకుండా చూడటంతో పాటు అర్హులకు అందేలా చూడాల్సి ఉంటుంది. అందుకే క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్ని అంశాలపై వీరికి పట్టు ఉండాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సివిల్స్‌కు ఎంపికైన వారిని క్షేత్ర స్థాయి శిక్షణకు పంపుతారు.
ఈ ఊళ్లో మాకు అది బాగా నచ్చింది..
"మేం ఇప్పటి వరకు సందర్శించిన గ్రామాల్లో కొత్తూరు బెస్ట్ విలేజ్. ఉత్తర భారత్‌తో పోలిస్తే ఇక్కడి గ్రామాలు చాలా అభివృద్ధి చెందాయి. ఈ గ్రామంపై ఇంకాస్త దృష్టి పెడితే ఈ ఊరు మోడల్ విలేజ్‌గా రూపుదిద్దుకుంటుంది. ఇక్కడి పాలనలో మహిళాల భాగస్వామ్యం చాలా ఉంది. గ్రామాభివృద్ధిలో స్త్రీలు పాలుపంచుకోవడం ప్రగతికి సోపానం."
- లక్ష్మణ్ కుమార్, ఐఆర్‌ఎస్ బిహార్ క్యాడర్