సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసారెడ్డి పల్లిలో సినిమాను మించిన డ్రామా నడుస్తోంది. తమకు నచ్చని వ్యక్తిని ఇబ్బంది పెట్టేలా కొందరు దేవుడి విగ్రహం పేరిట సరికొత్త కథను వాడుకుంటున్నారు. ఏసంతి అనే రైతుకు నలబై ఏళ్ల క్రితం దాదాపు రెండున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికీ ఆ భూమి ఆయన పేరిటే ఉంది. కొత్త పాసు పుస్తకమూ ఇచ్చారు. ఈ భూమి మీద ఆయన రుణమూ తీసుకున్నారు. రోడ్డు పక్కనే ఉన్న ఈ భూమిని ఆయనకు కాకుండా చేయాలని.. ఇదే గ్రామానికి చెందిన కొందరు యత్నించారు.
సినిమాను తలదన్నే డ్రామా :గుడి కడతాం.. భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఏసంతి ఒప్పుకోలేదు. దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేశారు. అధికారులకు అదే విషయమై ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో రైతు ఏసంతి గతేడాది న్యాయస్థానాన్ని ఆశ్రయించగా... ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో వారు పంథా మార్చారు. సినిమాను తలదన్నే డ్రామాకు తెరతీశారు.
పురాతన విగ్రహమని ప్రచారం:ఇటీవల దేవుని విగ్రహాన్ని చెక్కించారు. దానిని గుట్టుచప్పుడు కాకుండా రైతు ఏసంతి భూమిలో పాతిపెట్టారు. తవ్వకాల్లో దేవుని విగ్రహం బయటపడిందని పుకారు లేపారు. అది చాలా పురాతన విగ్రహమని.. దానికి ఎన్నో మహిమలు ఉన్నాయని ప్రచారం మొదలుపెట్టారు. దాంతో అక్కడ పూజలు మొదలయ్యాయి. చిన్న గుడిసె వేసి అందులో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ముందు రెండు టెంట్లు వేసి ఆలయం తరహా కలరింగ్ ఇవ్వడం మొదలెట్టారు.