ఆ తల్లికి... కన్నబిడ్డలే అమ్మగా మారారు.. సంగారెడ్డికి చెందిన రహేలాకు ఇద్దరు కుమార్తెలు. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. రహేలాకు అన్యాయం చేస్తూ.. భర్త మరో వివాహం చేసుకున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. చెదరకుండా ముందుకు సాగింది. మిషన్ కుడుతూ.. ఇద్దరు పిల్లల్ని చదివిస్తోంది. పెద్ద కూతురు ఇంటర్ రెండో సంవత్సరం, చిన్న కూతురు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. తల్లి కష్టాలను చూసిన వారు సైతం.. ఆమె కలలు నిజమయ్యేలా చదువుల్లో రాణిస్తున్నారు.
ఛిద్రం చేసిన ప్రమాదం..
ప్రశాంతంగా సాగుతున్న వారి జీవితాన్ని రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేసింది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన తన పెద్ద బిడ్డను స్కూటిపై హాస్టల్లో దింపి.. వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలు తగిలాయి. మెదడులో రక్తం గడ్డకట్టింది. సంగారెడ్డిలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. గాంధీకి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. అక్కడ చికిత్స అందించినా.. పెద్దగా మార్పు కనిపించలేదు. ఉలుకు, పలుకు లేకుండా అచేతనంగా మారిపోయింది రహేలా.
తండ్రే ఆధారం..
ఆసుపత్రిలో ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని.. వైద్యులు సూచనల మేరకు ఇంటికి తీసుకువచ్చారు. హోంగార్డుగా పనిచేస్తున్న రహేలా తండ్రే అన్నీ తానై చూసుకుంటున్నాడు. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషిస్తున్న ఎల్లయ్య.. తన బిడ్డ చికిత్స కోసం ఉన్న కొంత భూమిని అమ్మకానికి పెట్టాడు.
అమ్మకే అమ్మయ్యారు..
కనీసం చేయి కూడా కదపలేని స్థితిలో ఉన్న రహేలాకు ద్రవ ఆహారం, ఔషధాలు అన్నీ ముక్కు నుంచి ఏర్పాటు చేసిన పైపు ద్వారానే అందిస్తున్నారు. వెన్ను నొప్పితో బాధ పడుతున్న రహేలా తల్లి చంద్రకళ.. బిడ్డకు సపర్యలు చేయలేని స్థితిలో ఉంది. తండ్రి ఎల్లయ్య ఉద్యోగానికి వెళ్తే కానీ కుటుంబం గడవని పరిస్థితి. ఆ చిన్నారులే వారి అమ్మకే అమ్మయ్యారు. చదువు మానేసి తల్లి వద్దే ఉంటున్నారు. సమయానికి ఆహారం, మందులు తల్లికి అందిస్తున్నారు.
మనసున్న దాతలు స్పందిస్తే.. రహేలా ఆరోగ్యం మెరుగవడమే కాక.. పిల్లల కలలు సాకారం అవుతాయి.
ఇవి కూడా చదవండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!