తాము 2023లో అధికారంలోకి రాగానే ఉత్తర్‌ప్రదేశ్ మాదిరిగా తెలంగాణలో జనాభా నియంత్రణ చట్టం తేవడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు వద్దు అనేది భాజపా విధానమన్నారు. మతపరమైన రిజర్వేషన్ల వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఆ రిజర్వేషన్లను పెంచి తెరాస ప్రభుత్వం ఎంఐఎం నేతలకు లబ్ధి చేకూర్చాలని చూస్తోందని తాము కచ్చితంగా అడ్డుకొని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణం నుంచి మొదలై సంగారెడ్డి పట్టణానికి చేరింది. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన సభకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తన పాదయాత్రలో చాలా మంది సమస్యలు చెప్పుకుంటున్నారని వివరించారు. సాగునీరు కాదు కదా... కనీసం తమకు తాగునీరు కూడా రావడం లేదని చెబుతున్నారన్నారు. మరి సాగుకు నీరు రాకుండా ప్రాజెక్టుల పేరిట ఖర్చు చేసిన ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో ప్రతి పేదకూ ఇల్లు కట్టించేలా ఎన్ని లక్షల ఇళ్లయినా కేంద్రం నుంచి మంజూరు చేయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. వాస్తవాలు మాట్లాడే అధికారులకు ఈ ప్రభుత్వంలో వేధింపులు తప్పడం లేదన్నారు.
తెరాస ఝూటా పార్టీ: తేజస్వి సూర్య