Etela Rajender on Land Grabbing: మెదక్ జిల్లా అచ్చంపేట భూముల్లో ఒక్క ఎకరా అక్రమం అని తేలినా… ముక్కు నేలకు రాస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సంగారెడ్డిలో నిర్వహించిన భాజపా జిల్లా శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే, మంత్రి స్థాయిలో ఉన్న తాను భూముల కోసం బెదిరిస్తే... ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ భూముల కోసం ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారని ఈటల ప్రశ్నించారు.
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న వ్యక్తి కేసీఆర్. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మీరు కూడా హుజూరాబాద్‌లో ఏమి జరిగిందో గుర్తు చేసుకోండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు కూడా అంతరాత్మ సాక్షిగా ఓట్లు వేయండి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రజలకు కట్టుబడి ఉండాలి. కర్తవ్యాన్ని మరిచిపోయి ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను పాటిస్తే.. వారి గతి ఏమవుతుందో మనం గతంలోనే చూశాం.
ఒక్క ఎకరం కబ్జా చేసినా అని నిరూపిస్తే ముక్కు నేల రాస్తాను. ఒకవేళ ఉంటే తీసుకోమనే చెప్తాను. నేనే భూ కబ్జా చేస్తే.. మరి కేసీఆర్ ఎంత భూ కబ్జా చేసి ఉండాలి? ఒక శాసన సభ్యుడికి, మంత్రికి బెదిరించే అధికారముంటే.. మరి ముఖ్యమంత్రికి ఎంత ఉండాలి? నువ్వెన్ని చేసి ఉండాలి మరి. నాదేమో తొండలు కూడా గుడ్లు పెట్టని భూమి. అలాంటి భూమిని కబ్జా చేసేందుకు బెదిరించిన అని ఆరోపణలు ఎందుకు? కొండాపూర్‌లో అసైన్డ్ భూములను ఏమి చేశారు మరి..