బ్యాంకులు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాయన ఉద్దేశంతో ప్రభుత్వం వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తోంది. వ్యవసాయ అనుబంధ రంగాల రుణాలపై ప్రతి బ్యాంకుకు టార్గెట్లు నిర్దేశిస్తోంది. అయినా బ్యాంకు అధికారులు... రైతుల పట్ల చిన్నచూపే చూస్తున్నారు. అన్నదాతకు రుణం ఇవ్వడంలో, తనఖా పెట్టిన భూమి, బంగారం వంటివి రుణం తీర్చాక విడుదల చేయడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సరైన అవగాహన లేని వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఏ బ్యాంకు ముందు చూసినా ధీనంగా రైతులు కనిపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద ఈటీవీ భారత్కు ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.
బొబ్బిలిగామ గ్రామానికి చెందిన మొగులయ్య అనే రైతుకు ఒక్కడే కొడుకు. కొడుకుకు ఉపాధి దొరుకుతుందని ఐదు సంవత్సరాల క్రితం బ్యాంకులో రుణం తీసుకొని ట్రాక్టరు కోనుగోలు చేశాడు. మొగులయ్య కొడుకు ట్రాక్టర్ నడుపుకుంటూ... వాయిదాలు చెల్లించాడు. రెండు సంవత్సరాల క్రితం కొడుకు మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం మొగులయ్యపైనే పడింది. దీనికి తోడు... ట్రాక్టరు నడిపే వారు లేక, దాని నుంచి వచ్చే ఆదాయం తగ్గింది. అందిన చోటల్లా అప్పులు చేసి బ్యాంకు వాయిదాలు చెల్లించాడు. చివరికి అప్పులు చేయలేక ఆరు నెలల క్రితం వాయిదా కట్టడం ఆపేశాడు. దీంతో వెంటనే బ్యాంకు వాళ్లు ట్రాక్టర్ లాక్కెళ్లారు. నెల క్రితం మొగులయ్య బ్యాంకు అధికారులను సంప్రదించగా... ఐదున్నర లక్షల రూపాయలు చెల్లిస్తే లోన్ సెటిల్ చేసి ట్రాక్టర్ ఇస్తామన్నారు. ఎలాగోలా అప్పు చేసి... చెల్లించాడు. ఆ తర్వాత పంట రుణం కూడా చెల్లించాలనగా... మరో లక్షన్నర బ్యాంకులో కట్టాడు. ఇప్పుడు తీరా ట్రాక్టర్ ఇవ్వమంటే... బ్యాంకు అధికారులు కుంటి సాకులు చెబుతున్నారు. ముందే చెప్తే ఈ కష్ట కాలంలో అప్పులు చేయకపోయేవాడినని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.