తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ వద్ద హజ్రత్ పీర్ గైబ్ సాహేబ్ దర్గా ఉంది. ఏటా ఫిబ్రవరిలో ఉర్సు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో నిర్వహించే రెండు కార్యక్రమాలకు దూర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు హాజరవుతారు. సుమారు 350 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న పశువుల మేళాకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ సమయంలో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండవు కాబట్టి... ఎద్దులు, ఆవులను తీసుకొని అన్నదాతలు ఇక్కడికి వస్తారు.
ఇక్కడి మేళాలో మేలైన పశుల అమ్మకం, కొనుగోళ్ల కోసం పొరుగు రాష్ట్రాల రైతులు కూడా వస్తారు. రానురానూ పశుపోషణకు ఆదరణ తగ్గుతున్నందున... రైతుల్లో తిరిగి ఆసక్తి పెంచేందుకు నిర్వాహకులు 16 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. వివిధ కేటగిరీల వారిగా పశువులను, రైతులను ఎంపిక చేసి వారికి బహుమతులు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.