పద్మశ్రీ స్వస్థలం సంగారెడ్డి. నాన్న కల్వ పుల్లారెడ్డి క్రాప్స్ నర్సరీ రైతు. కూరగాయల నారు విక్రయిస్తారు. అమ్మ సరళ. తనకో తమ్ముడు. ఆ కుటుంబానికి నర్సరీనే ఆధారం. వ్యవసాయంలో ఒడుదొడుకులు నర్సరీ మీదా ప్రభావం చూపుతూ ఉంటాయి. అవన్నీ దగ్గరగా చూసిన పద్మశ్రీ... రైతు సమస్యలకు పరిష్కారం చూపించాలనుకుంది.
పతకాల సాగు!:
ఇంటర్‌లో 980 మార్కులు తెచ్చుకుంది. తర్వాత నిజామాబాద్ జిల్లాలో రుద్రూర్ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాలలో బీటెక్‌లో చేరింది. తన అకడమిక్స్‌లోనూ రైతు సమస్యలకు పరిష్కారం చూపించే ప్రాజెక్టును ఎంచుకుంది. టొమాటోలను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఏం చేయొచ్చనేదే ఈ ప్రాజెక్టు. టొమాటోలకు రొయ్యపొట్టు, అలోవెరా తదితర పదార్థాలతో కోటింగ్ వేస్తే సుమారు నలభై ఐదు రోజుల వరకూ నిల్వ ఉంచొచ్చని రుజువు చేశారు. ముగ్గురు బృందంగా ఏర్పడి చేసిన ఈ ప్రయోగానికి ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం, ఎ-ఐడియా సంయుక్తంగా ఏర్పాటు చేసిన పోటీల్లో దక్షిణ భారతదేశంలోనే ‘బెస్ట్ ప్రాజెక్టు ఐడియా’గా గుర్తింపు పొందింది. ఇదే కాదు... చదువులో రాణిస్తోంది. జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం నుంచి ‘అవుట్ స్టాండింగ్ గోల్డ్ మెడల్’ను సొంతం చేసుకుంది పద్మశ్రీ. ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాలలో చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. మంచి గ్రేడ్ సాధించడంతో రెండు బంగారు పతకాలను అందుకుంది.