తెలంగాణ

telangana

ETV Bharat / state

అమీన్​పూర్​ అనాథాశ్రమ ఘటనలో వెలుగుచూస్తున్న కీలకాంశాలు - rape case updates

సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ అనాథాశ్రమంలో లైంగికదాడికి బలైన బాలిక కేసు దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది కాలంగా బాలికపై అఘాయిత్యం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడితో పాటు సహకరించిన ఆశ్రమ నిర్వాహకులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.

అమీన్​పూర్​ అనాథాశ్రమ ఘటనలో వెలుగుచూస్తున్న కీలకాంశాలు
అమీన్​పూర్​ అనాథాశ్రమ ఘటనలో వెలుగుచూస్తున్న కీలకాంశాలు

By

Published : Aug 14, 2020, 5:47 AM IST

అమీన్​పూర్​ అనాథాశ్రమ ఘటనలో వెలుగుచూస్తున్న కీలకాంశాలు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన 14ఏళ్ల అనాథ బాలిక మృతి కేసులో పలు కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. తనపై ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలిక వాంగ్మూలమిచ్చిందని పటాన్‌చెరు డీఎస్పీ రాజేశ్వరరావు వెల్లడించారు. కానీ, బాలిక మూత్ర సంబంధమైన సమస్యకు శస్త్రచికిత్స చేయించామని... తలకు చిన్న గాయమైతే పసుపు అద్దామని ఆశ్రమ నిర్వాహకులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.

బంధువులు సైతం కొట్టారు...

లాక్‌డౌన్‌ సమయంలో మార్చి 21న బాలికను బంధువులు తమ ఇంటికి తీసుకెళ్లారు. నాలుగు నెలల తర్వాత తిరిగి చేర్చుకోవాలని రెండు సార్లు కోరినా కొవిడ్‌ నిబంధనల పేరిట నిర్వాహకులు నిరాకరించినట్లు బంధువులు తెలిపారు. అయితే లాక్‌డౌన్‌ సమయంలోనే 29మంది పిల్లలకు ప్రవేశాలు కల్పించినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికను బంధువులు సైతం కొట్టినట్లు బాలల సంరక్షణ కమిటీ గుర్తించింది. వారిపై జీడిమెట్ల పీఎస్‌లో డీసీపీయూ ఫిర్యాదు చేసింది. అమీన్‌పూర్‌ ఆశ్రమాన్ని పోలీసులు గురువారం సీజ్‌ చేశారు.

నిందితుని పోలీసు ఉన్నతాధికారి సాయం...!

బోయిన్‌పల్లి పోలీసులు జులై 31న జీరో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి అమీన్‌పూర్‌ పోలీసులకు పంపించారు. లైంగిక వేధింపులు, పోక్సో చట్టం కింద వెంటన్‌ నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. అయితే అమీన్‌పూర్‌ పోలీసులు విచారణ పేరిట వారం రోజులు జాప్యం చేసి... ఆగస్టు 7న నిందితులను అరెస్టు చేసినట్లు చూపించారు. ఫార్మా పరిశ్రమలో పనిచేసే వేణుగోపాల్‌రెడ్డి... వృద్ధులు, అనాథలకు సాయం చేస్తున్నానంటూ భారీగా నిధులు సేకరించేవాడని దర్యాప్తులో తేలింది. తాను చేస్తున్న సాయాన్ని బాలికల ద్వారా చెప్పిస్తూ... వీడియోలను సామాజికమాధ్యమాల్లో పోస్టు చేసి ప్రచారం చేసుకునేవాడు. ఈ కేసులో నిందితుడిని తప్పించేందుకు ఓ పోలీసు ఉన్నతాధికారి సాయపడినట్లు గుర్తించారు. వేణుగోపాల్‌రెడ్డితో పాటు ఆశ్రమ నిర్వాహకులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.

అనుమతులు లేకుండానే ఆశ్రమం...

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఈ ఆశ్రమంపై.... ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో ఆశ్రమాన్ని మియాపూర్‌ నుంచి అమీన్‌పూర్‌లోని హెచ్​ఎంటీ స్వర్ణపురి కాలనీలోకి మార్చి.... జిల్లా అధికారుల నుంచి అనుమతులు తీసుకోలేదు. దీనిపై ఫిర్యాదులు రాగా.... మహిళా సంక్షేమశాఖ అధికారులు డిసెంబర్‌లో తనిఖీలు నిర్వహించారు. అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. స్పందన రాకపోవటం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి తనిఖీ చేశారు.

బాలిక మృతిపై విచారణకు రాష్ట్ర బాలల భద్రత కమిటీ నలుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నిన్న సమావేశమైన ఈ కమిటీ... బోయిన్‌పల్లి, అమీన్‌పూర్‌ ఠాణాల్లో నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు. నేటి నుంచి విచారణ ప్రారంభించనున్నారు.

ఇవీ చూడండి:అమ్మలా ఆదుకుంటాయనుకున్న ఆశ్రమాలే... అత్యాచారాలకు నిలయాలుగా...

ABOUT THE AUTHOR

...view details