Icrisat PM visit: ఫిబ్రవరి 5న ఇక్రిశాట్(అంతర్జాతీయ సమశీతోష్ణ మండల పంటల పరిశోధన సంస్థ).. స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ వేడుకలకు హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా బలగాలు ముందస్తుగా ఏరియల్ సర్వే నిర్వహించాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో ఉన్న ఇక్రిశాట్ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. భద్రతా బలగాలు గగనతలంలో తిరుగుతూ సంస్థ ప్రాంగణం మొత్తాన్ని పరిశీలించారు. వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రధాన మంత్రి కార్యాలయం ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇక్రిశాట్ వర్గాలు తెలిపాయి. ఇక్రిశాట్ నూతన లోగోను ప్రధాని ఆవిష్కరించనున్నారు.
పోషకాహార భద్రత కోసం
Icrisat golden jubilee: రైతులకు మేలైన విత్తనాలు, నూతన సాగు విధానాలను చేరువచేస్తూ.. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఆహార సంక్షోభ నివారణకు ఇక్రిశాట్ ఇతోధిక సేవలందిస్తోంది. పటాన్‌చెరులో 3,434 ఎకరాల్లో 1972లో ఈ సంస్థ ఏర్పాటైంది. ప్రధానంగా కంది, జొన్న, వేరుసెనగ, సెనగ, సజ్జలు తదితర పంటలకు సంబంధించి వందల వంగడాలను ఆవిష్కరించిన ఈ సంస్థ.. కొత్తగా ‘పోషకాహార భద్రత’ కల్పించే, వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలపై పరిశోధనలు చేస్తోంది. కృత్రిమ మేధ(ఏఐ)తో సాగు పద్ధతుల్లో మార్పులు, భూసార పరీక్షలతో పంటల ఉత్పాదకత పెంపు లక్ష్యంగా పలు ప్రాజెక్టులు అమలు చేస్తోంది.