అడవుల నుంచి చిరుతపులులు తరచుగా జనవాసాల్లోకి రావటం భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఊహించని విధంగా ఆవాసాల మధ్య పులులు ప్రత్యక్షమవుతుండటంతో..... ప్రాణాలరచేతిలో పెట్టుకుని, పరుగులు తీసే పరిస్థితి నెలకొంటోంది. తాజాగా.... హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఓ చిరుత స్థానికులను, అటవీసిబ్బందిని గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టింది. హెటిరో ల్యాబ్స్ H-బ్లాక్‌లోకి తెల్లవారుజామున 4గంటల సమయంలో చిరుత ప్రవేశించింది. రియాక్టర్ల ఛాంబర్‌లో సంచరిస్తుండటాన్ని గమనించిన కార్మికులు బయటికి పరుగులు తీశారు. ల్యాబ్ తలుపులు మూసి వేసి.... పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అటవీ అధికారులు, నెహ్రూ జూపార్కు నుంచి ప్రత్యేక బృందం.. హెటిరో ల్యాబ్స్‌కు చేరుకుని.... చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. పారిశ్రామికవాడలో పనిచేసేవారు అటువైపు రానివ్వకుండా... పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రియాక్టర్ల కింద నక్కటంతో బంధించేందుకు చిరుతను పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. నాలుగైదు గంటల తర్వాత తొలుత ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ నుంచి తప్పించుకోగా... రెండో సారి ఇచ్చిన ఇంజెక్షన్‌తో మత్తులోకి జారుకుంది. వెంటనే లోపలికి వెళ్లిన అటవీసిబ్బంది చిరుతని బోనులో బంధించారు. అనంతరం...ప్రత్యేక వాహనంలో జూపార్క్‌కు తరలించారు.