ఆదివారం మధ్యాహ్నం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాంతం.. ఓ యువతి ఆర్టీసీ బస్సు ఎక్కి సికింద్రాబాద్ జేబీఎస్‌లో దిగింది. ప్రయాణికులందరూ దిగిపోయాక.. బస్సులో ఓ పర్సు పడి ఉండడాన్ని కండక్టర్ రవీందర్ గమనించారు. అది ఎవరిదో తెలుసుకోవడానికి పర్సును తెరిచి చూస్తే.. అందులో రూ.403 నగదుతో పాటు ఓ లేఖ దొరికింది. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. అందుకే చనిపోవాలనుకుంటున్నానని ఆ లేఖలో రాసి ఉండడం చూసి ఆయన కంగుతిన్నారు.
పర్సులో యువతి ఆధార్ కార్డు ఉండడంతో వెంటనే ఆయన ట్విటర్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. సూసైడ్ లేఖ, ఆధార్ కార్డు ఫొటోలను షేర్ చేశారు. ఎండీ తక్షణం స్పందించి.. ఆ యువతిని గుర్తించాలంటూ సిబ్బందిని ఆదేశించారు. ఆర్టీసీ ఎస్సై దయానంద్, మారేడ్‌పల్లి పోలీసుల సహాయంతో ఎట్టకేలకు ఆమెను గుర్తించి కుటుంబీకులకు అప్పగించారు. సకాలంలో స్పందించి యువతి ప్రాణాలను కాపాడిన సిబ్బందితో పాటు కండక్టర్ రవీందర్‌ను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌లు అభినందిస్తూ ట్వీట్ చేశారు.