సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం... మామిడి ప్రియులకు అత్యంత ఇష్టమైన ప్రాంతంగా నిలుస్తోంది. రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పరిశోధన కేంద్రంలో మామిడి, జామతోపాటు ఇతర రకాల పండ్లపై పరిశోధనలు నిర్వహిస్తారు. ఫల రాజు మామిడిలో వందల రకాలు ఇక్కడ సాగు చేస్తుండటంతో జాతీయ స్థాయిలో ఈ కేంద్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు 477 రకాల మామిడిపండ్లు ఇక్కడ అందుబాటులో ఉండటంతో... దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఫలరాజ ప్రియులను ఆకర్షిస్తోంది.
మందు లేకుండా ఏ కెమికల్ వాడకుండా.. వినియోగ దారులకు అందిస్తున్నాం. దాదాపు 450కి పైగా రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వినియోగదారులు వస్తుంటారు. ఎక్కువగా హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఇక్కడ మంచి రకాల మామిడి పండ్లు ఉన్నాయి. కాయ చెట్టుమీద పండుగా అయిన తర్వాతే తెంపి ఇస్తారు. ఎటువంటి రసాయన పదార్థాలు వాడరు.
- దుకాణదారులు
దసేరీ, కలాకండ్, లంగ్డా, హిమాయత్, బేనిషాన్, పంచదార, చెరుకు రసాల్, నాగిని, మంజీర.. ఇలా వందల రకాల పండ్లు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడి తోటలో పండిన పండ్లను ప్రత్యేక దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా తామే చెట్టు నుంచి కోసుకునే అవకాశాన్నీ కల్పిస్తున్నారు. ఈసారి వాతావరణ ప్రతికూల ప్రభావంతో దిగుబడి తక్కువగా ఉందని దుకాణదారులు చెబుతున్నారు. హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల వారు తమ వద్ద పండ్లు తీసుకెళ్తుంటారని వివరిస్తున్నారు.