a boy killed a person under the influence of alcohol: ఎవరైనా మద్యం తాగేటప్పుడు సమ వయస్కులతో తాగాలని అనుకొంటారు. మరికొందరు వాళ్ల కుటుంబీకులతో తాగుతారు. దీనిక భిన్నంగా ఓ వ్యక్తి మద్యపాన నిబంధనలు మర్చిపోయి తనతో పాటు తాగడానికి తోడుగా ఓ బాలుడిని ఎంచుకున్నాడు. ఇద్దరు కలసి మద్యం షాపు దగ్గరే తాగడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆ దుకాణం ఆవరణంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ గొడవ పెరిగి పెరిగి గాలివానై హత్య చేసే వరకు వెళ్లింది. తనతో పాటు సిట్టింగ్లో కూర్చున్న బాలుడే ఆ వ్యక్తిని హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో శనివారం వెలుగు చూసింది.
జిన్నారం సీఐ వేణుకుమార్, హత్నూర ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాలకు చెందిన ఎం.ఆమదయ్య (55), అదే గ్రామానికి చెందిన పన్నెండేళ్ల బాలుడు కలిసి శుక్రవారం అర్ధరాత్రి వరకు మద్యం తాగారు. మత్తులో వారిద్దరూ గొడవపడ్డారు.
ఈ ఘర్షణలో ఆగ్రహించిన బాలుడు ఖాళీ బీరు సీసాను పగులగొట్టి ఆమదయ్య గొంతులో బలంగా పొడిచాడు. అతడు కుప్పకూలి ప్రాణాపాయ స్థితిలో కదులుతుండగా.. బాలుడు మళ్లీ ఆమదయ్య గొంతులో పొడిచి కాలుతో తొక్కి చంపేశాడు. అనంతరం వ్యక్తి జేబులో నుంచి రూ.500 తీసుకుని పారిపోయాడు. ఆ రాత్రి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిద్రపోయాడు. శనివారం ఉదయం దగ్గర్లో ఉన్న గుమ్మడిదలకు వెళ్లి కొత్త బట్టలు కొనుక్కొన్నాడు.