Harish Rao At Super Specialty Hospital BhumiPuja In Patancheru : ఎవరికి ఏం కావాలో తెలిసిన నాయకుడు.. మన సీఎం కేసీఆర్ అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. పటాన్ చెరులో రూ.183 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి పూజ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా గతంలో ఏదైనా రోగం వస్తే గాంధీ ఆస్పత్రికో, ఉస్మానియాకో వెళ్లాల్సి వచ్చేదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలను 50వేలకు పెంచుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక.. 21 వైద్య కళాశాలలు వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
200 Beds Super Specialty Hospital In Patancheru : త్వరలోనే సంగారెడ్డిలో కూడా వైద్య కళాశాల ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని హర్షించారు. సంగారెడ్డి జిల్లాలో ప్రతి చోటా ఆస్పత్రుల ఆధునీకరిస్తున్నామని.. పటాన్ చెరు నియోజవర్గంలో 11 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పుడు పటాన్‌చెరు కార్మికులకు ఇక్కడే వైద్య చికిత్స అందుతోందని హరీశ్‌రావు వెల్లడించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.