రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతానని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys sharmila) స్పష్టం చేశారు. నేను నిరూపిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. చేవేళ్ల మండల కేంద్రంలో మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించే ముందు జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు (praja prasthanam yatra). నేటి నుంచి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్రను వైఎస్ విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్ (ysr) సంక్షేమ పాలనను తీసుకురావడమే పాదయాత్ర లక్ష్యమని షర్మిల వెల్లడించారు.
కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా..
రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలు 14 పార్లమెంట్ నియెజకవర్గాల్లో 400రోజుల పాటు 4వేల కిలోమీటర్ల పరిధిలో షర్మిల పాదయాత్ర చేయనున్నారు. తన తండ్రి వైఎస్ఆర్ చూపిన బాటలోనే తాను నడుస్తున్నానని ప్రజల సంక్షేమం పట్టని సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యమన్నారు. ఏడేళ్లలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని... 30వేల ఉద్యోగాలను తీసివేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వందల మంది నిరుద్యోగులు ఆత్మ హత్యలు చేసుకున్నారన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌లు రాక ఎంతో మంది నిరుద్యోగులు హమాలీలు, కూలీలు, టీకొట్లలో పనిచేసే వాళ్లుగా మారారన్నారు. లక్షా 90వేల ఉద్యోగ ఖాళీలున్నా నోటిఫికేషన్‌లు మాత్రం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్కరోజు దీక్షచేస్తామంటేనే చిన్నదొర కేటీఆర్ గారికి జీర్ణం కాలేదు. వ్రతాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరి ఇప్పుడు పాదయాత్రలో ప్రతి రోజు మేము ప్రజల మధ్యనే ఉంటాము. ఇప్పుడేమంటారో అనండి చిన్నదొరా... అని అడుగుతున్నాను. ఆడదాన్ని అయ్యుండి ప్రజల పక్షాన.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు నేను పాదయాత్ర చేస్తున్నాను. మరి మీరు అధికారంలో ఉండి ప్రజల పక్షాన.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఏం చేస్తున్నారు..? దమ్ముంటే నాతో పాటు పాదయాత్రకు రండి.. సమస్యలు లేవు అని మీరు అంటున్నారు కదా..! కేసీఆర్ పాలన అద్భుతమని మీరు అంటున్నారు కదా.. రండి.. నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి నేను ఇంటికి వెళ్లిపోతా... ఎన్ని సమస్యలు ఉన్నాయో నేను చూపిస్తా.. ఎంత అభివృద్ధి చేశారో మీరు చూపెట్టండి. ఒకవేళ సమస్యలు ఉంటే మీరు క్షమాపణలు చెప్పి రాజీనామాలు చేసి ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలి. దమ్ముంటే ఈ సవాలును స్వీకరించండి. వైఎస్ షర్మిల, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు
ఆయన కేసీఆర్ చేతిలో చిలక
కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకున్న అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (tpcc president revanth reddy) అని వైఎస్ షర్మిల ఆరోపించారు. రేవంత్ రెడ్డిలాగ తమకు బ్లాక్ మెయిల్ చేయడం చేతకాదని... ప్రజాప్రతినిధులు కొనుగోలు, అమ్మకాలు తమకు తెలియదన్నారు. ఓటుకు నోటు కేసులో సీఎం కేసీఆర్ చేతిలో రేవంత్ చిలకలా మారిపోయారని విమర్శించారు. అడ్డంగా దొరికిన దొంగకు విశ్వసనీయత ఉంటుందా అని ఆమె ప్రశ్నించారు.