ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను షర్మిల ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్దకు తల్లి విజయమ్మతో కలిసి చేరుకుని ప్రార్థనలు చేశారు.
వైఎస్ఆర్ సంక్షేమ పాలన అంటే రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం, రుణమాఫీ, పిల్లలకు ఉచిత విద్య పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడమే అని షర్మిల అన్నారు. తెలంగాణలో సంక్షేమ పాలన లేదని..తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర (YS Sharmila padayatra news)మొదలుపెడుతున్నామని తెలిపారు.
'తెలంగాణలో వైఎస్‌ఆర్ సంక్షేమ పాలన లేదు. వైఎస్‌ఆర్ పాలన తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర. రేపు చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభిస్తాం. తెలంగాణలో ప్రతి పల్లెకు పోతాం, ప్రతి గడపను తడతాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజలంతా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను' - షర్మిల, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు