తెలంగాణ

telangana

ETV Bharat / state

తహసీల్దార్ దారుణ హత్య... నాగోల్​లో అంత్యక్రియలు - women tahasildar vijaya was set to fire in office itself by unknown person at abdullapurmet rangareddy district

అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం జరిగింది. విధుల్లో ఉండగానే తహసీల్దార్ హత్యకు గురయ్యారు. ఓ దుండగుడు పెట్రోల్ పోసి నిప్పంటించడం వల్ల ఆమె అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. బుధవారం నాడు నాగోల్​ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అమానుషం... అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ దారుణ హత్య

By

Published : Nov 4, 2019, 4:20 PM IST

Updated : Nov 4, 2019, 10:44 PM IST

హైదరాబాద్‌ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘోరం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ దారుణ హత్యకు గురయ్యారు. కార్యాలయంలోనే తహసీల్దార్‌ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.

భర్త, పిల్లలతో తహసీల్దార్ విజయారెడ్డి

మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఓ దుండగుడు తహసీల్దార్‌ ఛాంబర్‌లోకి ప్రవేశించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ దుండగుడు కూడా తనకు తాను నిప్పంటించుకున్నాడు.

తహసీల్దార్ హత్య... మరో ఇద్దరికి తీవ్రగాయాలు

తహసీల్దార్‌ను కాపాడే యత్నంలో మరో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన తహసీల్దార్‌ డ్రైవర్‌తోపాటు అటెండర్‌ను హయత్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాలిన గాయాలతో బయటకు పరుగులు...

ఘటన అనంతరం దుండగుడు కాలిన గాయాలతో బయటకు పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఏర్పడిన తర్వాత విజయారెడ్డి తొలి తహసీల్దార్‌గా నియమితులయ్యారు. నిందితుడు కాలిన గాయాలతో ఉండటంతో సమీపంలోని ఏదైనా ఆస్పత్రికి వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు నిందితుడు గౌరెల్లికి చెందిన సురేశ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల ఆధీనంలో...

తహసీల్దార్‌ మృతి నేపథ్యంలో కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుడు తహసీల్దార్‌ కార్యాలయంలోకి ఎలా ప్రవేశించాడనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఓ సంచితో లోపలికి ప్రవేశించినట్లు కార్యాలయ సిబ్బంది పోలీసులకు తెలిపారు.

నిందితుడిని ఉరితీయాలి: సిబ్బంది

తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం ఘటనను కార్యాలయ సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.

విజయారెడ్డి మృతదేహం తరలింపును ఉద్యోగ సంఘాల నేతలు అడ్డుకున్నారు. తహసీల్దార్‌ హత్యకు కారణమైన వ్యక్తిని ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు భద్రత లేకుండా పోతోందంటూ నినాదాలు చేశారు. సీపీ మహేశ్‌ భగవత్‌ ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.

నాగోల్​లో అంత్యక్రియలు

విజయారెడ్డి మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో శవపరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రి నుంచి స్వగృహమైన... కొత్తపేట వాసవీ కాలనీలోని లక్ష్మీనివాస్ అపార్ట్​మెంటుకు తరలించారు. బుధవారం నాడు నాగోల్​లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.

Last Updated : Nov 4, 2019, 10:44 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details