రామోజీ ఫిల్మ్‌సిటీలో వినోదాలు పంచుతున్న వింటర్ ఫెస్ట్.. ramoji film city winter fest: సందర్శకుల కేరింతలతో భూతల స్వర్గాన్ని తలపించే రామోజీ ఫిల్మ్‌సిటీ కోలాహలంగా మారింది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ప్రారంభమైన వింటర్ ఫెస్ట్.. చల్లటి వాతావరణంలో సందర్శకులకు సరాదాలు పంచుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడే ఉత్సాహాన్ని నింపే వినోద కార్యక్రమాలతో పర్యాటకులు ఆనందడోలికల్లో మునిగిపోతున్నారు.
గజిబిజిగా గడిపే బాహ్య ప్రపంచాన్ని మరిచి.. సంతోషాల హరివిల్లును ఆస్వాదిస్తున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైన ఈ వింటర్ ఫెస్ట్.. జనవరి 29 వరకు జరగనుంది. 45 రోజుల పాటు జరిగే ఈ కార్నివాల్‌లో పర్యాటకుల్ని ఆకర్షించేందుకు సరదా కార్యక్రమాలు, లైవ్‌షోలు, థ్రిల్లింగ్ రైడ్‌లు, ఆటపాటలు, భోగి మంటలు.. ఇలా మరెన్నో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.
వింటర్ ఫెస్ట్ తొలిరోజు వచ్చిన సందర్శకులకు.. రామోజీ ఫిల్మ్ సిటీ సరికొత్త ఆనందాల్ని నింపింది. పర్యాటకులకు ప్రకృతి అందాలతోపాటు వారిని మైమరిపించేందుకు నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అన్నిరకాల పాటలకు కళాకారులతో కలిపి కాలు కదిపిన పర్యాటకులు... ప్రపంచాన్ని మరిచి ఆహ్లాదాన్ని ఆస్వాదించారు. కార్నివాల్ కళాఖండాల వాహనాలను ఆసక్తిగా తిలకించారు. వాటితో కలిసి స్వీయచిత్రాలు తీసుకొని సంతోషించారు. విదేశీ సాంప్రదాయంలో చేసిన నృత్యాలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి పాఠశాల విద్యార్థులు, ఇతర రాష్ట్రాల నుంచి సందర్శకులు ఫిల్మ్‌సిటీకి తరలివస్తున్నారు.
సాయంత్రం సమయంలో మదిని ఉల్లాసపరిచే సాంస్కృతిక కార్యక్రమాల సందడిలో..... పర్యాటకులు తడిసి ముద్దయ్యారు. విద్యుద్దీపాలంకరణలోని గార్డెన్ల అందాలు వీక్షిస్తూ.. ఆనందడోలికల్లో విహరించారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి తన్మయత్వం పొందారు. నిర్వాహకులు చక్కటి సౌకర్యాలు అందిస్తున్నారంటూ అతిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన ప్రతీసారి ఫిల్మ్‌సిటీలో మరెన్నో చూడదగ్గ ప్రదేశాలతో పాటు కొత్త కొత్త వినోద కార్యక్రమాలు అలరిస్తున్నాయని సందర్శకులు చెబుతున్నారు. రోజంతా తిరిగినా తనివి తీరలేదంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సందర్శకులను కనువిందు చేసే వింటర్ ఫెస్ట్ జనవరి 29 వరకు సాగనుంది.
ఇవీ చదవండి: