రంగారెడ్డి జిల్లాలో ఖరీఫ్, యాసంగిలో కలుపుకొని 61 వేల ఎకరాల్లో కూరగాయ పంటలు సాగవుతున్నాయి. యాసంగిలో 21 వేల ఎకరాలలో సాగు చేశారు. మేడ్చల్ జిల్లాలో 2400 ఎకరాల్లో కూరగాయ పంటలు పండిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ సీజన్‌లో పండించిన టమాటా, వంకాయ, బీర, దొండ, బెండ, సొరకాయ వంటి కూరగాయలపై తీవ్ర ప్రభావం పడింది. ‘
9 ఎకరాల్లో బీర సాగు చేస్తే రూ.9 లక్షలు ఖర్చయ్యాయని శామీర్‌పేటకు చెందిన రైతు, భారతీయ కిసాన్ సంఘ్ కార్యనిర్వాహక ప్రతినిధి కె.సురేందర్‌రెడ్డి తెలిపారు. చివరకు రూ.6 లక్షల పంటను కూడా అమ్మలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎందుకీ పరిస్థితి...
ఉద్యానవన, మార్కెటింగ్ శాఖాధికారులు చేసిన సర్వే ప్రకారం.. లాక్‌డౌన్‌తో నగరంలో 20-25 శాతం మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరో 25 శాతం మంది తమకు అందుబాటులో ఉన్నవే వండుకుని తింటున్నారు. మరో 20 శాతం మంది పేదలు కావడం వల్ల కూరగాయలు కొనడం లేదు. మిగిలిన 30 శాతం మందే కొంటున్నారు.
విడతల వారీ సాగే మేలు...
రానున్న సీజన్ దృష్ట్యా రైతులు పలు సూచనలు పాటించాలని రంగారెడ్డి జిల్లా ఉద్యానవన శాఖాధికారిణి ఎన్.సునందారాణి తెలిపారు. పంటలు వేసేటప్పుడు 15-20 రోజుల సమయం తీసుకుని విడతల వారీగా వేయాలని సూచించారు. దానివల్ల పంటంతా ఒకేసారి దిగుబడి రాదు. ఒకసారి కాకపోయినా మరోసారి ధర పొందవచ్చని పేర్కాన్నారు.
అలాగే వేర్వేరు రకాల కూరగాయలు పండించాలన్నారు. ఒక రకానికి ధర లేకపోయినా మరోరకం దానికి ఉన్న ధరతో గట్టెక్కవచ్చని తెలిపారు. ప్రభుత్వ నర్సరీల్లో నారును ఇస్తున్నాం.. ఆసక్తి ఉన్న రైతులు నారు తీసుకుని నాటుకోవచ్చన్నారు. దానివల్ల రైతులకు 40-45 రోజుల కాలం తగ్గుతుందని ఆమె చెప్పారు.