హైదరాబాద్ చుట్టూ భూముల ధరలకు రెక్కలోస్తున్నాయి. గజం భూమి కూడా దొరకడం గగనంగా మారిపోయిన తరుణంలో ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు వైవిధ్యంగా ఆలోచించారు. హస్తినాపురంలో నివాసం ఉంటున్న ఇందుర్తి శ్యాంసుందర్‌రెడ్డి. వ్యవసాయం పట్ల ప్రేమతో రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఓ లేఔట్‌లో తన ఇంటి ప్లాట్లు వృధాగా ఉంచకుండా ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టారు. ప్రకృతి సేద్యం పితామహుడు డాక్టర్ సుభాశ్ పాలేకర్ శిక్షణ తరగతులకు హాజరై సమయంలో పొందిన విజ్ఞానం ఆధారంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం 500 గజాల స్థలంలో కూరగాయలు, పండ్లు, బహువార్షిక రకాల పంటల సాగు చేపట్టారు. మామిడి, జామ, బొప్పాయి, దానిమ్మ, కొబ్బరి, బత్తాయి, నిమ్మ, వాటర్ యాపిల్, యాపిల్ బేర్, ద్రాక్ష, డ్రాగన్‌ఫ్రూట్, అరటి, ఉసిరి, రేగు వంటి 200 రకాల పండ్ల మొక్కలు పెంచుతున్నారు. వంగ, టమాట, బీర, దోస, బెండ, దొండ, గోరుచిక్కుడు, మునగ, సుగంధ ద్రవాలు 15 రకాల కూరగాయలు, బిర్యానీఆకు, కొత్తిమీర, పుదీనా, బచ్చలికూర, పాలకూర, తోట కూర లాంటి 10 రకాల ఆకుకూరలు సాగు చేస్తున్నారు. కంది, పెసర, మినుము లాంటి రకాల పప్పుధాన్యాలు సైతం ఈ నమూనాలో జోడించారు. సుభాష్ పాలేకర్ విధానంలో భాగంగా ఐదు అంచెల పద్ధతిలో రసాయనాలకు ప్రత్యామ్నాయంగా జీవామృతం, ఘనామృతం ఉపయోగించి పండిస్తూ నెలకు ఇంటి అవసరాలకు సరిపడా రసాయన అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరలు పొందుతున్న తాము మరో ఐదారు కుటుంబాలకు ఇవ్వగలుగుతున్నామని శ్యాంసుందర్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
ఇళ్ల ప్లాట్లలో సాగు:
నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం కారవంగకు చెందిన శ్యాంసుందర్‌రెడ్డి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. వ్యవసాయకుటుంబ నేపథ్యం ఉన్న ఆయన 2006లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. సొంతూరులో వ్యవసాయంతోపాటు చిన్నచిన్న వ్యాపారాలు చేశారు. హైకోర్టు సహా రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ హస్తినాపురంలో నివాసం ఉంటున్న శ్యాంసుందర్‌రెడ్డి నగరసేద్యానికి శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఇంటి ప్లాట్లు వృథాగా ఉంచకుండా కూరగాయలు, పండ్ల మొక్కలు సాగుచేస్తున్నారు. రకరకాల ఆకుకూరలతో పాటు బిర్యానీ ఆకును పండించడం విశేషం. కంది, పెసర, మినుము తదితర పప్పుధాన్యాలను ఇంటి అవసరాలకు సరిపడా పండిస్తున్నారు. రసాయన ఎరువులు వాడకుండా సుభాశ్ పాలేకర్ తరగతులకు హాజరై సేంద్రీయ పద్దతులు అవలంభిస్తున్నారు.