రాష్ట్రంలో పలు చోట్ల భారీవర్షాలు పడుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకూ పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా టేక్మాలు (మెదక్)లో 20, సత్వార్ (సంగారెడ్డి జిల్లా)లో 13.4, జుక్కల్ (కామారెడ్డి)లో 16, బోడగాట్ (మెదక్)లో 12, షేక్‌పేట, చందూలాల్ బారాదరి (జూ పార్క్ ఎదురుగా-హైదరాబాద్)లో 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అత్యధికంగా బాలానగర్ (హైదరాబాద్)లో 7.1, రామారం (సిద్దిపేట)లో 7.1 సెం.మీ.ల వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా వాగులో గల్లంతై ఇద్దరు మృతిచెందారు. వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. రాష్ట్రంలో వాతావరణం బాగా చల్లబడింది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 4 డిగ్రీల వరకూ తక్కువగా ఉండటంతో చలి వాతావరణం ఏర్పడింది.
జుక్కల్ నియోజకవర్గం అతలాకుతలం
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో బుధవారం రాత్రి కురిసిన వర్షంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు గండ్లు పడి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో కట్టుబట్టలతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. జుక్కల్ నుంచి మద్నూర్ వెళ్లే మార్గంలో పెద్దఏడ్గి వాగు నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ దారి కొట్టుకుపోయింది. అధికారులు బాధితులను పాఠశాల భవనాల్లోకి తరలించారు. కుండపోతగా కురిసిన భారీ వర్షానికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామంలోని పీతిరి వాగు బుధవారం రాత్రి పొంగిపొర్లింది. అది గమనించకుండా వాగు దాటుతూ ఏర్పుల రాజు(40), మెట్లకుంట రాజేశ్వర్(42)లు గల్లంతై మృత్యువాత పడ్డారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో 24 గంటల్లో అత్యధికంగా 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సింగూరు ప్రాజెక్టులో 61 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 10.89 టీఎంసీల నీరు ఉంది.