TSSPDCL Suggestions on Kites Festival: విద్యుత్ లైన్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తుండటంతో.. సురక్షిత ప్రాంతాల్లో ఎగురవేయడం శ్రేయస్కరమని పేర్కొన్నారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పతంగులు ఎగురవేసినట్లయితే వాటి మాంజాలు విద్యుత్ లైన్లు ట్రాన్స్‌ఫార్మర్లపై పడి ప్రమాదాలు జరుగడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుందని చెప్పారు. మెటాలిక్ మాంజాలు విద్యుత్ వాహకాలైనందున అవి లైన్లపై పడినప్పుడు విద్యుదాఘాతం జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
వదిలేయడమే మంచిది..
పతంగులు లేదా మాంజాలు విద్యుత్ లైన్ల పరికరాలపై పడినప్పుడు వదిలేయాలని.. వాటిని పట్టుకుని లాగినప్పుడు విద్యుత్ తీగలు ఒకదానికొకటి రాసుకుని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని రఘుమారెడ్డి పేర్కొన్నారు. ఒక వేళ విద్యుత్ వైర్లపై, విద్యుత్ పరికరాలపై పతంగులు లేదా మాంజాలు తెగి పడినట్లు ఉన్నా.. విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడి ఉన్నా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాటిని తాకకుండా వెంటనే విద్యుత్ శాఖ హెల్ప్‌లైన్ 1912 కి గాని, సమీప విద్యుత్ కార్యాలయానికి గాని, సంస్థ మొబైల్ ఆప్ ద్వారా గాని, సంస్థ వెబ్సైట్ www. tssouthernpower.com ద్వారా తమకు సమాచారం అందించాలని కోరారు.
ఇదీ చదవండి:Fake Notes at Madhapur : రోడ్డుపై గుట్టలు గుట్టలుగా 2 వేల నోట్లు.. తీరా చూస్తే..!!