స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు(Local body MLC Elections Telangana) తెరాస అభ్యర్థులుగా శంభీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి నామ పత్రాలు సమర్పించారు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో శంభీపూర్ రాజు, మహేందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ల కార్యక్రమంలో మంత్రులు సబిత, మల్లారెడ్డి, తెరాస ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
పోచంపల్లి నామినేషన్
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్‌లో ఈ ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు ఈ రోజు నామపత్రాలు సమర్పించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా... ఆయన తరఫున మరో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మరో సెట్ నామినేషన్లను వేశారు. అనంతరం జడ్పీ చైర్మన్లు కుసుమ జగదీష్, పాగాల సంపత్ రెడ్డి, చైర్ పర్సన్ గండ్ర జ్యోతిలు, ఒక సెట్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌లు ఒక సెట్ చొప్పున పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తరపున నామినేషన్లు వేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ వాసుదేవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
మంత్రుల సమక్షంలో నామపత్రాలు
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ మాట్లాడుతూ... ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విజయం ఖాయం అభిప్రాయపడ్డారు. రైతు బంధువుగా ఉన్న సీఎం కేసిఆర్ ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలు తెరాసకు మెండుగా ఉన్నాయన్నారు. అందరి శ్రేయస్సు కోసం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. దేశంలోని రైతులకు న్యాయం చేసే విధంగా కేసీఆర్ ఆలోచనలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టారు.