తెలంగాణ

telangana

ETV Bharat / state

Gaddiannaram fruit market issues: కళతప్పిన ఫ్రూట్ మార్కెట్​.. అయోమయంలో చిరువ్యాపారులు!

Gaddiannaram fruit market issues : ఎప్పుడూ వివిధ రకాల ఫలాలతో కళకళలాడే పండ్ల మార్కెట్‌ ఇప్పుడు కళతప్పింది. దూర ప్రాంతాల నుంచి లారీలు, ట్రక్కుల్లో వచ్చిన పండ్లను స్థానిక వ్యాపారులు ఆటోలు, ట్రాలీల్లో తీసుకెళ్తూ హడావిడిగా కనిపించే గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌... ఇప్పుడు వాహన చప్పుడు లేకుండా నిశ్శబ్ధంగా ఉంది. వ్యాపార కార్యక్రమాలు లేక 73 రోజులుగా వ్యాపార బోసిపోతోంది.

Gaddiannaram fruit market issues, traders problems with fruit market
కళతప్పిన ఫ్రూట్ మార్కెట్

By

Published : Dec 20, 2021, 2:04 PM IST

కళతప్పిన ఫ్రూట్ మార్కెట్

Gaddiannaram fruit market issues : హైదరాబాద్‌ గడ్డి అన్నారం మార్కెట్‌ కళ తప్పింది. మార్కెట్‌ తెరవాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.... ఉన్నతాధికారులు స్పందించడం లేదంటూ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మార్కెట్‌స్థలంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాత్కాలికంగా బాటసింగారంలోని లాజిస్టిక్‌ హబ్‌లో వసతులు కల్పించారు. అక్కడ పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేవరకు... గడ్డి అన్నారం మార్కెట్‌ కొనసాగించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో మార్కెట్‌ వద్దకు వెళ్లిన వ్యాపారులకు నిరాశే మిగిలింది. కమీషన్‌ ఏజెంట్లను అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకున్నారు. తమకు ఆదేశాలు లేవని తిప్పి పంపించారు. కోర్టు తీర్పు కాపీలను చూపించినా ప్రయోజనం లేకపోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

ఏం జరిగింది?

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ స్థలంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖకు 22 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలాగే బాటసింగారంలోని లాజిస్టిక్‌ హబ్‌లో మార్కెట్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేసింది. ఇక్కడ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించడాన్ని కమీషన్‌ ఏజెంట్లు కూడా స్వాగతించారు. అయితే నగర శివార్లలోని కోహెడలో సౌకర్యాలు కల్పించి... మార్కెట్​ను శాశ్వతంగా అక్కడకి తరలించాలని వ్యాపారులు పట్టుపట్టారు. అప్పటి వరకూ గడ్డి అన్నారం మార్కెట్లోనే వ్యాపార లావాదేవీలకు అనుమతి ఇవ్వాలని వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులను కోరారు. వ్యాపారుల విజ్ఞప్తిని పట్టించుకోకుండా.. సెప్టెంబరు 25న గడ్డిఅన్నారం మార్కెట్‌కు తాళం వేశారు. దీనిపై వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు.

గందరగోళం

బాటసింగారం లాజిస్టిక్‌ హబ్‌లో వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని... అప్పటివరకు గడ్డి అన్నారం మార్కెట్‌ను కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అక్టోబరు 4న జారీ చేసింది. అయితే ఉత్తర్వులను మార్కెటింగ్‌ శాఖ పట్టించుకోలేదు. ఇలా నాలుగుసార్లు కోర్టును ఆశ్రయించడం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. బాటసింగారానికి తరలివెళ్లాల్సిందేనంటూ మార్కెట్​శాఖ వ్యాపారులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోవడంలేదని వ్యాపారులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా... నెల రోజుల పాటు ఇక్కడే వ్యాపారాలు సాగేలా చూడాలని ఈ నెల 13న తుది తీర్పు చెప్పింది. ఈ తీర్పు కాపీలను తీసుకుని మంగళవారం మార్కెట్‌కు వెళ్తే అక్కడ పెద్దయెత్తున మోహరించిన పోలీసులు వ్యాపారులను అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల నుంచి తమకు ఆదేశాలు లేవని వెనక్కి పంపారు.

న్యాయం కోసం కోర్టుకు పోయినం. కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఉన్నవాళ్లేమో.. మాకు పర్మిషన్ లేదు అంటున్నారు. 70 రోజులు దాటింది. ఇప్పుడు కోర్టు నుంచి ఫైనల్ ఆర్డర్ వచ్చింది. ఫైనల్ ఆర్డర్​ను కూడా పట్టించుకోవడం లేదు. కోర్టు ఆర్డర్లకు ఇక్కడ విలువ లేదా? కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలా?.

-అశోక్, పండ్ల మార్కెట్‌ కమీషన్‌ ఏజెంట్ల సంఘాల సమాఖ్య కన్వీనర్‌

అయోమయంలో రైతులు

గడ్డి అన్నారంలో 22 ఎకరాల్లో సాగిన వ్యాపార కార్యకలాపాలు.. బాట సింగారంలో 8 ఎకరాలకే పరిమితమయ్యాయి. 'అక్కడ పండ్లను రాసిగా పోసి అమ్మడానికి ప్లాట్‌ఫారాలు లేవు. షెడ్లులేవు.. ఎండకు ఎండి.. వానకు తడవాల్సిందే' అని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పండిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. గడ్డిఅన్నారం మార్కెట్‌ తెరవకుండా.. బాటసింగారంలో వ్యాపారాలు సవ్యంగా సాగకపోతే ఎలా? అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో కమీషన్‌ ఏజెంట్లు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో బత్తాయి, నారింజ, దానిమ్మ, బొప్పాయి.. ద్రాక్ష రైతులు నష్ట పోతున్నారు.

కమీషన్‌ ఏజెంట్లు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. ట్రాలీలు, ఆటోల్లో పండ్లు తీసుకెళ్లే మేం... ఎక్కడకు వెళ్లాలో తెలియని పరిస్థితి. బాటసింగారంలో పూర్తి స్థాయిలో పండ్ల వ్యాపారాలు జరగడం లేదు. గడ్డిఅన్నారంలో మార్కెట్‌ తెరచుకోవడం లేదు.

-చిరు వ్యాపారులు

ఇదీ చదవండి:Free Drinking Water Supply Hyderabad : ఉచితంగా ఇస్తామన్నా.. ఉలుకూపలుకూ లేదు!

ABOUT THE AUTHOR

...view details