తెలంగాణ

telangana

ETV Bharat / state

పొలాల్లో మితిమీరిన రసాయన ఎరువుల వాడకం.. పొంచి ఉన్న పర్యావరణ ముప్పు

Chemicals usage in Farm Fields: రాష్ట్రంలో రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరిగిపోతోంది. వ్యవపాయ పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం తీరు ఏటా భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణానికి పెను ముప్పు అని తెలిసి కూడా పైర్లు పచ్చగా ఏపుగా పెరిగి అధిక దిగుబడులు సాధించాలన్న ఆశతో అధిక శాతం రైతులు విష రసాయనాలు విచ్చలవిడిగా వాడుతున్నారు. ఫలితంగా పొలాల్లో భాస్వరం నిల్వలు భారీగా పేరుకుపోయినట్లు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. పొంచి ఉన్న ముప్పును అధిగమించేందుకు రసాయన ఎరువుల వాడకం క్రమబద్ధీకరించుకుంటూ ప్రకృతి, సహజ, సేంద్రీయ పద్ధతుల్లో సేద్యం చేసినట్లయితే పెట్టుబడులు తగ్గడమే కాకుండా నాణ్యమైన, ఆరోగ్యకర, విషరహిత ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలు పొందచ్చని శాస్త్రవేత్తలు సూచించారు.

Chemicals usage in Fields
పంటపొలాల్లో రసాయన ఎరువుల వాడకం

By

Published : Mar 5, 2022, 3:53 PM IST

Chemicals usage in Farm Fields: రాష్ట్రంలో వ్యవసాయ పంటల సాగులో అధిక దిగుబడుల సాధన కోసం రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. ఇది భారీగా దుష్ఫలితాలు ఇస్తున్నప్పటికీ రైతుల్లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. నత్రజని పోషకంతో ఉండే యూరియా, రసాయన ఎరువులు వేస్తే పంట ఏపుగా పచ్చగా పెరిగి అధిగ దిగుబడి వస్తుందనే అపోహ రైతుల్లో బాగా ఉంది. ఫలితంగా ఏటా వానా కాలం, యాసంగి సీజన్లలో కలిపి యూరియా ఒక్కటే 20 లక్షలు పైగా టన్నులు వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్​ సీజన్‌లో రాష్ట్రానికి యూరియా ఒక్కటే 10 లక్షల టన్నులు పైగా అవసరమవుతుందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. దేశంలో పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం అధికంగా ఉంది. ఈ వాకడం నియంత్రించాలని పదేపదే చెబుతున్నప్పటికీ... ఎలాంటి మార్పు రాకపోవడంతో కేంద్రం... వ్యవసాయ శాఖకు మరోసారి సూచించింది.

పోషకాలు ఉన్నా కూడా.. రసాయనాలు

Chemicals usage is high in Farm Fields: రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా తొలకరి వానలు కురవగానే పిల్లిపెసర, జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట విత్తనాలు చల్లి అవి ఏపుగా పెరగగానే పొలంలో కలియదున్నితే భూమికి అవసరమైన నత్రజని పోషకం బాగా అందుతుంది. ఇది సంప్రదాయంగా పూర్వం నుంచి తాత ముత్తాతలు అవలంభించిన విధానమే అయినా... ఇటీవల కాలంలో అది చాలా వరకు తగ్గిపోయింది. వ్యవసాయ పంటలకు యూరియా వాడకం పెద్దగా అవసరం ఉండదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత వ్యవసాయ పరిశోధన మండలి - ఐసీఏఆర్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ అధ్యయనంలో వెల్లడైంది. కొన్ని జిల్లాల్లో భాస్వరం, నత్రజని, పొటాష్‌ చాలా ఎక్కువగా ఉన్నా... మళ్లీ రసాయనాలు చల్లుతున్నారు. ఆ ప్రాంతాల్లో సాగు నీరు, నేల మాత్రమే కాకుండా పర్యావరణంలోకి సైతం కాలుష్యం విడుదలై అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని జయశంకర్ వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్ అన్నారు.

అవసరానికి మించి

భాస్వరం పోషకం వ్యవసాయ పంటలకు ఇచ్చేందుకు డై అమ్మోనియం ఫాస్పేట్- డీఏపీ పేరిట మార్కెట్‌లో రసాయన ఎరువు విక్రయిస్తున్నారు. ఏడేళ్ల కాలంలో తెలంగాణలో ఏకంగా 38 శాతం డీఏపీ వినియోగం పెరిగినట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్యయనంలో శాస్త్రవేత్తలు, అధికారులు గుర్తించారు. ఇది ఆందోళన కలిగించే అంశమే. ప్రధాన వాణిజ్య పంట పత్తిసహా పసుపు, వేరుశనగ తదితర పంటలు, ఇతర కూరగాయలు, పండ్ల తోటలు అధికంగా సాగు చేసే ప్రాంతాల్లో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలు పరిశీలిస్తే అవసరానికి మించి భాస్వరం ఉన్నట్లు తేలింది. ఇది ఎక్కువగా ఉంటే డీఏపీ ఎరువు పెద్దగా వినియోగించాల్సిన అవసరం ఉండదు. అయినా... రాష్ట్రంలో రెండు సీజన్లలో కలిపి ప్రతి సంవత్సరం 5 లక్షల టన్నులు పైగా డీఏపీ పొలాల్లో చల్లుతున్నారు. సాధారణంగా సన్న రకం వరి వండగాలతో సాగు చేస్తే పంట కాల పరిమితి 150 రోజులు పైగా ఉంటుంది. ఇతర దొడ్డు రకాలు వరి వండగాలు సాగు చేస్తే 120 నుంచి 130 రోజుల్లో పంట కోతకు వస్తుంది. కానీ, రసాయన ఎరువులు మాత్రం సన్న రకాలకు ఎంత వేస్తారో... ఇతర రకాలకు కూడా అంతే మొత్తంలో వేస్తున్నారు. వరి ఎకరాకు 3,4 బస్తాలు యూరియా చల్లాలనే అపోహ అధిక శాతం రైతుల్లో ఉంది. వాస్తవానికి భూసార పరీక్ష చేయిస్తే ఒక బస్తా కంటే తక్కువ వేస్తే సరిపోతుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తించింది. ఇతర పంటలకూ ఇలాగే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల వాడకం వల్ల నేలలు నిస్సారమవుతున్నాయి. విష రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించాలంటూ గ్రామీణ ప్రాంతాల్లో సదస్సులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.

రైతుల్లో అవగాహన అవసరం

ఈ ఏడాది ఖరీఫ్​ సీజన్‌ కోసం ఇప్పట్నుంచే వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమాయత్తమవుతూ... పంటల ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నయ్యాయి. వాతావరణ మార్పులు దృష్టిలో పెట్టుకుని విచక్షణారహితంగా రసాయన ఎరువుల వినియోగం తగ్గింపుపై రైతు వేదికలు, రైతు శిక్షణ కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాయి. భూసార పరీక్షల ఆధారంగా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాయి.

ఇదీ చదవండి:మంత్రి హత్యకు కుట్ర కేసు.. నిందితుల 10 రోజుల కస్టడీకి పోలీసుల పిటిషన్​..

ABOUT THE AUTHOR

...view details