తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీగా పెరిగిన నార్లాపూర్‌ అంచనా

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన నార్లాపూర్‌ రిజర్వాయర్‌ అంచనా భారీగా పెరిగింది. ప్రభుత్వం గతంలో రూ. 892 కోట్లకు సాంకేతిక అనుమతి ఇవ్వగా, ఇప్పుడది రూ. 1,448.64 కోట్లకు చేరింది. డిజైన్​లో మార్పుల కారణంగా.. గత అంచనా కంటే ఏకంగా 62 శాతం పెరిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

The Narlapur Reservoir estimate has increased tremendously
భారీగా పెరిగిన నార్లాపూర్‌ అంచనా

By

Published : Feb 26, 2021, 5:20 AM IST

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన నార్లాపూర్‌ (అంజనగిరి) రిజర్వాయర్‌ అంచనా ఏకంగా రూ. 556 కోట్లు పెరిగింది. డిజైన్‌లో మార్పు, రిజర్వాయర్‌ నిర్మాణానికి అవసరమైన మట్టిని ఎక్కువ దూరం నుంచి తెచ్చుకొనేలా గుత్తేదారుకు అనుమతించడంతో గత అంచనా కంటే ఏకంగా 62 శాతం పెరిగింది. గతంలో రూ. 892 కోట్లకు సాంకేతిక అనుమతి ఇవ్వగా, ఇప్పుడది రూ. 1,448.64 కోట్లకు చేరింది. దీంతో పాటు డిజైన్‌ మార్పు కారణంగా రిజర్వాయర్‌ సామర్థ్యం తగ్గడంతోపాటు ఇప్పటికే చేసిన ఖర్చులో సుమారు రూ. 41 కోట్లు వృథాకానుంది. సంబంధిత చీఫ్‌ ఇంజినీర్‌ చేసిన ఈ ప్రతిపాదనకు రాష్ట్రస్థాయి ఉన్నత సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

పెరిగిన ఖర్చు..

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొదటి రిజర్వాయర్‌ను ప్రభుత్వం నార్లాపూర్‌ వద్ద 6.55 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టింది. ఈ పనికి రూ.892.50 కోట్లతో సాంకేతిక అనుమతి ఇచ్చింది. ఇందులో నిర్మాణ పనికి రూ. 762.11 కోట్లతో టెండర్‌ పిలవగా, అంచనా కంటే 0.20 శాతం తక్కువకు రూ. 760.59 కోట్లకు రాఘవ-పీఎల్‌ఆర్‌ సంస్థలు సంయుక్తంగా ఈ పనిని దక్కించుకున్నాయి. 30 నెలల్లో పూర్తి చేసేలా 2016లో ఒప్పందం జరిగింది. 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఈ రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా 74 మీటర్ల ఎత్తు వరకు కొన్నిచోట్ల మట్టి కట్ట నిర్మించాల్సి ఉంటుంది. ముంపు ప్రాంతంలోని మట్టిని నిర్మాణానికి వినియోగించాల్సి ఉంది. అయితే ఇప్పుడు అక్కడ అవసరమైన మట్టి దొరకడం లేదని, 14, 18 కి.మీ. దూరం నుంచి మట్టి తీసుకు రావాల్సి ఉంటుంది కాబట్టి అదనంగా ఖర్చవుతుందని, ఇందుకోసం గుత్తేదారుకు మరో రూ. 296.12 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తేల్చారు. అవసరమైన మట్టి లభించని కారణంగా రెండో రీచ్‌లో తెహ్రీ ప్రాజెక్టు తరహాలో రాక్‌-ఫిల్‌డ్యాం నిర్మాణాన్ని చేపట్టాలని మొదట ప్రతిపాదించారు. దీనిపై అధ్యయనం కూడా జరిగింది.

రాక్‌-ఫిల్‌డ్యాంకు ప్రత్యామ్నాయం కోసం..

అయితే 2019 ఆగస్టులో జరిగిన నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో రాక్‌-ఫిల్‌డ్యాంకు బదులుగా ప్రత్యామ్నాయం ఆలోచించాలని నిర్ణయించారు. రెండో రీచ్‌లో మట్టికట్టను 74 మీటర్ల ఎత్తుకు కూడా నిర్మించాల్సి ఉన్నందున, దీనికి ప్రత్యామ్నాయంగా పూర్తి స్థాయి నీటి మట్టాన్ని 345 మీటర్ల నుంచి 338.5 మీటర్లకు తగ్గించాలని నిర్ణయించారు. దీని ప్రకారం మట్టికట్ట పొడవును ఈ రీచ్‌లో 600 మీటర్లకు బదులుగా 917 మీటర్లకు చేసి కట్ట ఎత్తును గరిష్ఠంగా 62 మీటర్లు ఉండేలా చేస్తే 6.4 టీఎంసీలు నిల్వ చేయవచ్చని ఒక ప్రతిపాదన, కట్ట పొడవును 2.585 మీటర్లు, ఎత్తు 43 మీటర్లతో 5.65 టీఎంసీలు నిల్వ చేసేలా మరో ప్రతిపాదన చేశారు. వాటిపై అధ్యయనం చేయించారు. మొదట నిర్ణయించిన అలైన్‌మెంట్‌లో మార్పు చేయడం వల్ల ఇప్పటికే చేసిన ఖర్చులో రూ.41 కోట్లు వృథా అవుతుందని అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో గత ఏడాది సెప్టెంబరులో గుత్తేదారు సంబంధిత ఇంజినీర్లకు ఓ వినతిపత్రం సమర్పించారు. రెండో రీచ్‌లో కట్టకు అవసరమైన మట్టి ముంపు ప్రాంతంలో కాని, సమీప ప్రాంతంలో కాని దొరకనందున 14 కి.మీ. దూరంలోని రాంపూర్‌ శివారు, 18 కి.మీ. దూరంలోని పెంట్లవల్లి గ్రామాల వద్దనుంచి తేవడానికి అనుమతించాలని కోరారు. సంబంధిత ఇంజినీర్లు కూడా గుత్తేదారు చెప్పినదానికే అంగీకారం తెలిపారు.

రాష్ట్ర కమిటీ ఆమోదం

మట్టి తీసుకురావడానికి గుత్తేదారుతో చేసుకున్న ఒప్పందం ధరలను పరిగణనలోకి తీసుకొంటే రూ. 417.16 కోట్లు అవుతుందని, రద్దు చేసి తాజా ధరల ప్రకారం టెండర్‌ పిలిస్తే రూ. 44.46 కోట్లు అదనంగా అవుతుందని ఉన్నతాధికారులకు నివేదించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత గుత్తేదారుకే దూరం నుంచి మట్టి తెచ్చుకోడానికి రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిజైన్‌ మారిన రెండో రీచ్‌లో పని విలువ రూ. 155 కోట్ల నుంచి రూ. 379 కోట్లకు పెరిగింది. గుత్తేదారు ఒప్పందంలో లేని ఇతర అవసరాలకు మొదటి అంచనాలో రూ. 130 కోట్లు ఉండగా, తాజాగా ఇది రూ. 390 కోట్లకు పెరిగింది. మొత్తమ్మీద ఈ రిజర్వాయర్‌ నిర్మాణ వ్యయం రూ. 892.50 కోట్ల నుంచి రూ. 1,448.64 కోట్లకు పెరగ్గా, గుత్తేదారు చేయాల్సిన పని విలువ రూ. 762.11 కోట్ల నుంచి రూ. 1,058.23 కోట్లకు పెరిగినట్లు తెలిసింది.

ఇదీ చదవండి:కాళేశ్వరం నీళ్లెన్ని వాడుకున్నారో లెక్కలున్నాయా: పొన్నాల

ABOUT THE AUTHOR

...view details