రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెదేపా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కరోనా వ్యాప్తిని అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ మండిపడ్డారు.
వైద్యం అందట్లేదు : రమణ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందడం లేదని ధ్వజమెత్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ పేద ప్రజలను దోచుకుంటున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. వెంటనే ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల్లో చికిత్సలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు.
రూ.5000 చొప్పున ఇవ్వాలి...
కరోనా కష్ట కాలంలో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి నెలకు రూ. 5,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. పన్నుల వసూళ్లను నిలిపి వేయడంతో పాటు లాక్డౌన్ సమయంలో విధించిన విద్యుత్ బిల్లులను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోత్స్న, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సుభాష్ యాదవ్, మేడ్చల్ అధ్యక్షుడు అశోక్ గౌడ్, , ఎస్సీ సెల్ అధ్యక్షుడు అశోక్, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సుభాన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేట్ దోపిడీ అరికట్టాలి : రమణ ఇవీ చూడండి : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా ప్రణాళికలు