Rats Biting Students: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలుర విద్యాలయంలో ఎలుకలు కలకలం రేపాయి. హాస్టల్లో నిద్రిస్తున్న తొమ్మిది మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. విద్యార్థులను షాద్నగర్ ప్రభుత్వ ఆసుప్రతికి తరలించి వైద్యం అందించారు.
గురుకుల పాఠశాలలో 850 మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడి టీచర్లు మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు తెచ్చి ఇచ్చిన స్నాక్స్ వల్లే ఎలుకలు వచ్చి ఉంటాయని అంటున్నారు. తొమ్మిది మంది విద్యార్థులకు ఎలుకలు కరవడంతో మిగతా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
తల్లిదండ్రులు తెచ్చిన తినుబండారాల వల్లే...
ఆదివారం సెలవు కావడంతో.. తమ పిల్లలను చూడడానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు వారి కోసం.. తినుబండారాలను తీసుకువచ్చినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ తినుబండారాలను విద్యార్థులు మూడో అంతస్తులో నిద్రించే గదిలోని ఓ బ్యాగులో పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా ఆదివారం రాత్రి తమ గదుల్లో విద్యార్థులు పడుకున్నారు. దీనితో తినుబండారాల కోసం వచ్చిన ఎలుకలు.. వారిని కొరికాయి. విద్యార్థులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాఠశాలలో 9 మంది విద్యార్థుల్లో ఇద్దరిని కొరకగా.. మిగిలిన వారిని గీకాయని విద్యార్థులు చెబుతున్నారు.
మళ్లీ ఇలాంటివి జరగకుండా చర్యలు
ఈ విషయాన్ని సోమవారం ఉదయం విద్యార్థులంతా అధ్యాపకులకు తెలపగా.. అక్కడే ఉన్న ఆరోగ్య సిబ్బంది దృష్టికి తీసుకువచ్చారు. ఆరోగ్య సిబ్బంది.. విద్యార్థులకు ప్రథమ చికిత్స చేసి.. షాద్నగర్ ఆసుపత్రికి తరలించారు. వారికి టీటీ ఇంజక్షన్ ఇప్పించారు. విద్యార్థులకు సరైన వైద్యం అందించామని ఎలాంటి ఇబ్బంది లేదని ఆరోగ్య సిబ్బంది, అధ్యాపకులు తెలిపారు. పాఠశాలలో 850 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని ప్రిన్సిపల్ సుభాన్ తెలిపారు. తినుబండారాల మూలంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకుంటామని అధ్యాపకులు తెలిపారు.