తెలంగాణ

telangana

ETV Bharat / state

Telugu Academy: గాడి తప్పిన తెలుగు అకాడమీ పాలన.. అసలేం జరుగుతోంది.? - inter text books by telugu academy

Telugu Academy: తెలుగు అకాడమీలో డిపాజిట్ల గల్లంతు వ్యవహారం వెలుగుచూసినప్పటి నుంచి.. ఆ సంస్థలో పాలన గాడి తప్పింది. ఓ వైపు విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఉచిత పాఠ్య పుస్తకాలు అందక ఇంటర్​ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మరో వైపు సరైన సమయంలో వేతనాలు అందక శాశ్వత ఉద్యోగులు.. 2 నెలలుగా జీతాలు అందక పొరుగు సేవల ఉద్యోగులు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు.

telugu academy
తెలుగు అకాడమీ

By

Published : Jan 9, 2022, 12:34 PM IST

Telugu Academy: తెలుగు అకాడమీలో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. రూ.65 కోట్ల మేర డిపాజిట్ల గల్లంతు వ్యవహారం వెలుగుచూసిన నాటి నుంచి ఈ పరిస్థితి నెలకొంది. అప్పటివరకు సంస్థ డైరెక్టర్‌గా ఉన్న సోమిరెడ్డిని తొలగించిన ప్రభుత్వం.. పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేనను ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా నియమించింది. ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కసారి కూడా అకాడమీకి వెళ్లలేదు. ఫలితంగా గత అక్టోబరు నుంచి అకాడమీలో పనులన్నీ ఆగిపోయాయి.

కాగితం లేదు

Telugu Academy Issue : ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరిన దాదాపు 30 వేల మందికి ఇంకా ఉచిత పాఠ్యపుస్తకాలు అందలేదు. ఈ పుస్తకాల కోసం ఇంటర్‌ విద్యాశాఖ తెలుగు అకాడమీకి ఆర్డర్‌ ఇచ్చినా ముద్రణకు నోచుకోలేదు. వాటిని ముద్రించడానికి అకాడమీ వద్ద కాగితం సైతం లేదు. కాగితానికి సెప్టెంబరులో టెండరు పిలవగా.. ఒక్క కంపెనీనే కొటేషన్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో సంచాలకురాలి ఆమోదంతో దాన్ని రద్దు చేసి మళ్లీ టెండర్‌ పిలవాల్సి ఉంది. అయితే గత నెల రోజుల నుంచి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా, కొత్త జిల్లాల వారీగా కేటాయింపు, పోస్టింగ్‌ల బిజీలో సంచాలకురాలు నిమగ్నమవడంతో.. దీనిపై దృష్టి సారించలేదని సమాచారం. ఇప్పటికిప్పుడు టెండరు పిలిచినా కాగితాన్ని అందించాలంటే మూడు నెలలు పడుతుందని చెబుతున్నారు. దీంతో ఆయా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వచ్చే విద్యా సంవత్సరానికి(2022-23) ఇంటర్‌ పాఠ్యపుస్తకాలు సకాలంలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయా? అన్నదీ ప్రశ్నార్థకంగా మారింది.

2 నెలలుగా జీతాల్లేని పొరుగు సేవల ఉద్యోగులు

అకాడమీలో ఉద్యోగులకు వేతనాలూ సకాలంలో అందటంలేదు. శాశ్వత ఉద్యోగులకు అక్టోబరులో 25న, నవంబరులో 15న, డిసెంబరులో 9వ తేదీన అందాయి. ఈ నెలలో 7న అందాయి. రెండు రాష్ట్రాల్లో అకాడమీ ప్రాంతీయ కేంద్రాల్లో 90 మంది వరకు పొరుగు సేవల ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏపీలో పనిచేస్తున్న వారికి నవంబరు నుంచి, ఇక్కడ పనిచేస్తున్న వారికి డిసెంబరు నుంచి జీతాలు అందడంలేదు. వచ్చేదే రూ.15 వేల జీతం.. అవి కూడా ప్రతి నెలా అందకుంటే ఎలా బతకాలని కొందరు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయి సంచాలకులను నియమిస్తే తప్ప అకాడమీ పాలన గాడిన పడటం కష్టమని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:NRIs Help to Villages : పల్లె ప్రగతికి ప్రవాస హారతి.. స్వగ్రామాలకు ఎన్‌ఆర్‌ఐల సొబగులు

ABOUT THE AUTHOR

...view details