తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (RAINS) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (HYDERABAD WEATHER CENTER) ప్రకటించింది. ఈరోజు రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీని ఫలితంగా నేడు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
గత నెలలో కురిసిన వర్షాలకు రాష్ట్రం చిగురుటాకుల వణికింది. పలు చోట్ల వరదలు ముంచెత్తాయి. జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు. భారీ వర్షాలకు చాలాచోట్ల చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆనకట్టలు తెగి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పలుచోట్ల ప్రజలు ప్రమాదకర స్థితిలోనూ ప్రయాణం సాగించారు. వరదల్లో చిక్కుకున్న పలువురు బాధితులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.