తెలంగాణ

telangana

ETV Bharat / state

పలు చోట్ల ప్రచారాలు.. మరికొన్ని చోట్ల ఆందోళనలు - తెలంగాణ పురపాలిక ఎన్నికలు

భోగి రోజు సైతం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపలిటీల పరిధిలో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. పలు చోట్ల బీ ఫారాలు అందని అభ్యర్థులు... నిరాసకు గురై కంటనీరు పెట్టుకోగా మరికొన్ని చోట్ల దాడులకు దిగారు.

municipal elections
municipal elections

By

Published : Jan 14, 2020, 10:58 PM IST

నామపత్రాల పరిశీలన ఇవాళ్టితో ముగియటం వల్ల పలుచోట్ల ఇప్పటికే బీ ఫారాలు అందుకున్న అభ్యర్థులు జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పలు వార్డుల్లో తెరాస అభ్యర్థులు... ముగ్గుల పోటీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు.

జోరు పెంచిన తెరాస

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ముగ్గులు వేసుకుంటున్న మహిళలను 21వ వార్డు తెరాస అభ్యర్థి కూర్మ కార్తీక్‌ ఓట్లు అభ్యర్థించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో తెరాస అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. మేడ్చల్ మున్సిపాలిటీలో 14వ వార్డుకు నామినేషన్ వేసిన విజయ్.. బీ ఫారం దక్కడం లేదని మనస్తాపానికి గురై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు అప్రమత్తమై అదుపులోకి తీసుకుని నీళ్లు పోసి అతనిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

పలు చోట్ల ఆందోళనలు

ఆదిలాబాద్ మున్సిపల్ తాజా మాజీ ఛైర్‌పర్సన్ రంగినేని మనీషాకు భంగపాటు ఎదురైంది. 48వ వార్డుకు నామపత్రం దాఖలు చేసిన ఆమెకు తెరాస నుంచి బీ ఫారం అందకపోవటంతో కంటతడి పెట్టారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగగర్‌ పురపాలికలో తెరాస అభ్యర్థులు ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు బీ ఫారాలు అందజేశారు. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. భాజపా, కాంగ్రెస్ పార్టీల టికెట్లు దక్కని ఆశావహులు, మద్దతు దారులు ఆందోళన చేపట్టారు.

బీ ఫారం చించిన రమేశ్​

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో వింత చోటు చేసుకుంది. 9వ వార్డులో భాజపా నుంచి కుందనపల్లి గీత, భాషబోయిన రమేశ్​లు నామపత్రాలు దాఖలు చేయగా.. పార్టీ బీ ఫారాన్ని కుందనపల్లి గీతకు కేటాయించింది. బీ ఫారాన్ని మున్సిపాలిటీ కార్యాలయంలో అందించేందుకు గీత తన అనుచరులతో కలిసి కార్యాలయానికి చేరుకోగా అదే సమయంలో... రమేశ్​ అక్కడకి చేరుకుని గీత భర్త రవీందర్‌రెడ్డి చేతిలో ఉన్న పార్టీ బీ ఫారాన్ని చింపివేశారు.

ఇంటింటి ప్రచారం

కరీంనగర్ జిల్లా చొప్పదండి పురపాలక సంఘ ఎన్నికల్లో భాగంగా 14వ వార్డులో ఎమ్మెల్యే సుంకే రవీందర్‌ ప్రచారం నిర్వహించారు. మెట్‌పల్లి పురపాలక పరిధిలో 26 వార్డులలో పోటీ చేసే అభ్యర్థులకు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు బీ ఫారాలు అందజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా లోని వెంకంపేట, నది అగ్రహారాలలో.. భాజపా నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టారు.

నిరసనలు

మహబూబాబాద్‌లో తెరాస అభ్యర్థులకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ దిశానిర్దేశం చేశారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఏకపక్షంగా వహిస్తూ ప్రత్యర్థులను తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని... భాజపా నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీ ఫామ్ లభించక పోవడంతో జనగామలోని ఎమ్మెల్యే ఇంటి ముందు తెరాస పార్టీ ఆశావహులు నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details