కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వానికి మరింత రుణం పొందే వెసులుబాటు లభించింది. రాష్ట్రాలు రుణాలు పొందడానికి ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) పరిమితి ఎంతో కీలకం. రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో అది గరిష్ఠంగా మూడు శాతంగా ఉండగా దానిని ఐదు శాతానికి పెంచుతున్నట్టు ఆదివారం కేంద్రం ప్రకటించింది. దానివల్ల రాష్ట్ర బడ్జెట్ పరిధిలో మరో రూ.22,102 కోట్ల రుణం తీసుకునేందుకు మార్గం సుగమమైంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలని తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కేంద్రాన్ని గతం నుంచి కోరుతూ వస్తున్నాయి.
పటిష్ఠ నిర్వహణ కోసం ఎఫ్‌ఆర్‌బీఎం
పారదర్శక, పటిష్ఠమైన ఆర్థిక నిర్వహణ కోసం 2003లో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని రాష్ట్రాల ఆమోదంతో కేంద్రం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలు ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో మూడు శాతానికి మించి రుణాలు తీసుకోకూడదు. రాష్ట్రాల సమర్థ ఆర్థిక విధానాలు, ఆర్థిక నిబద్ధత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మూడు శాతానికి అదనంగా 0.25 శాతం లేదా 0.5 వరకు గరిష్ఠంగా పెంచేందుకు చట్టం అవకాశం కల్పిస్తుంది.
బాండ్లతో రుణాలు..
2019-20 ఆర్థిక సంవత్సంలో తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 3.5 శాతంగా ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలోని రుణాలు రాష్ట్రాల బడ్జెట్ పరిధిలో ఉంటాయి. ఆర్‌బీఐ ద్వారా రాష్ట్రబాండ్లను వేలం వేసి తక్కువ వడ్డీ, ఎక్కువ కాలపరిమితితో రాష్ట్రాలు ఈ రుణాలను సమకూర్చుకుంటాయి. జాతీయ భద్రత, విపత్తుల సమయంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలో మినహాయింపు ఇచ్చేందుకు చట్టం అవకాశం కల్పిస్తుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో తాజాగా కేంద్రం ఈ పరిమితిని పెంచింది.
ప్రయోజనమిలా..
రాష్ట్ర ప్రభుత్వం రెండు రకాలుగా రుణాలను తీసుకుంటుంది. ఒకటి బడ్జెట్ పరిధిలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మేరకు తీసుకునే రుణాలు. ఇవి బాండ్లను విక్రయించి తీసుకునేవి. తక్కువ వడ్డీ.. చెల్లింపులకు దీర్ఘకాలిక సమయం ఉన్నందున రాష్ట్రాలకు వెసులుబాటుగా ఉంటుంది. రెండోది బడ్జెట్ వెలుపల తీసుకునే రుణాలు. వీటికి అత్యధిక వడ్డీ చెల్లించాలి. తక్కువ సమయంలోనే ఒక్కొక్కసారి అసలు కూడా కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ప్రత్యేక లక్ష్యంతో ఈ రుణాలను తీసుకుంటుంది. చెల్లింపునకు గ్యారెంటీ ఇస్తుంది. తెలంగాణలో ప్రభుత్వం మిషన్‌భగీరథ, రెండుపడక గదుల ఇళ్లనిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టులకు రుణాలను ఈ విధానంలో సమకూర్చుకుంది.